ఇంట్లోనే ఐమాక్స్ థియేటర్
ఐమాక్స్ థియేటర్‌లో తెర సాధారణ థియేటర్‌లో కన్నా పెద్దగా ఉంటుంది. ఐమాక్స్ తెరపై సినిమా చూడడం వల్ల ప్రేక్షకులు కొత్త అనుభూతికి లోనవుతారు.. ఇక్కడ ప్రదర్శించే చిత్రాలను ఐమాక్స్ ఫార్మాట్‌లోనే రూపొందించాలి. సాధారణ చిత్రాలను ఈ తెరమీద ప్రదర్శించడం కుదరదు. గత ఏడాది డిసెంబర్ వరకు దాదాపు 62 దేశాల్లో 934కు పైగా ఐమాక్స్ థియేటర్లు ఉన్నాయని ఓ అంచనా. అయితే ఇప్పటివరకు వాణిజ్య పరంగా మాత్రమే వినియోగిస్తున్న ఐమాక్స్ థియేటర్స్‌ను ఇంట్లో కూడా ఏర్పాటు చేసుకునే వీలుంది.
ఒకప్పుడు 3డీ చిత్రాలు చూడాలంటే థియేటర్‌కే వెళ్లాల్సి వచ్చేది. కానీ పెరిగిన సాంకేతికత కారణంగా ఇప్పుడు 3డీ సినిమాలు, గేమ్స్ టీవీల్లోనూ వీక్షించే అవకాశం ఉంది. ఈ మార్పును ఎవరూ ఊహించి ఉండరు. ఇదే కోవలో ఇప్పుడు ఐమాక్స్ పరిజ్ఞానం కూడా అందుబాటులోకి రానుంది. ప్రైవేట్ వినియోగానికి అనువుగా ఐమాక్స్ సాంకేతికతను అందుబాటులోకి తెస్తామని, ఇళ్లల్లోనే ఈ తరహా థియేటర్లు ఏర్పాటు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని 2013లోనే ఐమాక్స్ కార్పొరేషన్ ప్రకటించింది. అనంతరం టీసీఎల్ సంస్థతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టిన ఐమాక్స్ సంస్థ ఇటీవల తొలి ప్రైవేట్ ఐమాక్స్ తెరని రూపొందించింది. దీని పేరు ‘ప్యాలైస్’.
చైనాలో తొలిసారిగా: ఐమాక్స్ కార్పొరేషన్, టీసీఎల్ సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేసిన హోం స్టైల్ ఐమాక్స్ థియేటర్ ‘ప్యాలైస్’ను చైనాలోని షాంఘైలో ఆవిష్కరించారు. అసలైన ఐమాక్స్ థియేటర్ అనుభూతి కలిగేలా దీన్ని రూపొందించారు. ఇందుకోసం ప్రత్యేక సౌండ్ సిస్టం, ఫ్లోరింగ్, లైటింగ్, వాల్ ప్రొడక్షన్, సీటింగ్‌లను ఇందులో ఏర్పాటు చేశారు. దీన్ని చూసేందుకు సందర్శకులను తయారీదారులు అనుమతిస్తున్నప్పటికీ కొందరికి మాత్రమే ఈ థియేటర్‌లో ప్రవేశం కల్పిస్తున్నారు. దాదాపు రెండేళ్లపాటు దీని నిర్మాణంపై పరిశోధనలు సాగాయి. ఇప్పుడు ప్రయోగాత్మక దశలోనే ఉన్న ఈ ఐమాక్స్ థియేటర్‌ను త్వరలో అందరికీ అందుబాటులోకి తెచ్చేలా, ఇళ్లల్లోనే ఐమాక్స్ అనుభూతి కలిగేలా చేస్తామని తయారీదారులు తెలిపారు. అయితే ఈ థియేటర్‌కు సంబంధించిన పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు వెల్లడించలేదు.