
ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)
21 మందితో కేంద్ర మంత్రి వర్గాన్ని పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరీ ఆదివారం ప్రకటించారు..
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ నూతన ప్రధాన మంత్రిగా పగ్గాలు చేపట్టిన పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ తన నూతన మంత్రివర్గాన్ని ప్రకటించారు. విదేశాంగ మంత్రితో కలుపుకుని మొత్తం 21 మందితో కేంద్ర మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో 15 మంది కేంద్ర మంత్రులు కాగా, మరో ఐదుగురు ప్రధానికి సహాయకులుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు పీటీఐ అధికార ప్రతినిధి ఫవాద్ చౌదరీ ఆదివారం మంత్రుల పేర్లను ప్రకటించారు. మహ్మద్ ఖురేషీ విదేశాంగ మంత్రి బాధ్యతులు చేపట్టాగా, పర్వేజ్ కట్టక్ రక్షణ, అసద్ ఉమర్ ఆర్థిక, రావాల్పిండి నుంచి ఎన్నికైన షేక్ రషీద్ రైల్వే మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఈ మేరకు మంత్రులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనునట్లు సమాచారం. కాగా విదేశాంగ మంత్రిగా ఎన్నికైన ఖురేష్ గతంలోనే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ప్రభుత్వంలో (2008-2011) విదేశాంగ మంత్రిగా విధులు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ముంబై దాడులు జరగడంతో భారత పర్యటనను వచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మంత్రి వర్గంలో ముగ్గురు మహిళలకు కూడా చోటు లభించింది. వారిలో షీరిన్ మాజరీ, ఝుబైడా జలాల్, మీర్జాలు ఉన్నారు. కాగా పాకిస్తాన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ నేత ఆరీఫ్ అల్వీని ప్రకటించే అవకాశం ఉందని పీటీపీ తెలిపింది. సెప్టెంబర్ 5న నూతన అధ్యక్షుడిని ఎనుకోనున్నారు.