ఇస్లామాబాద్ : యూటర్న్‌లు తీసుకున్న వారే నిజమైన నాయకులుగా ఎదుగుతారని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. అలా చేయనందువల్లే హిట్లర్, నెపోలియన్ లాంటి మహామహులు సైతం ఓటమిని చవిచూడక తప్పలేదని అభిప్రాయపడ్డారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. చైనాతో తమ దేశానికి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. పాకిస్తాన్‌ను ఆదుకునేందుకు చైనా పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసేందుకు సిద్ధంగా ఉందని ఇమ్రాన్ తెలిపారు. తమకు విడుదల చేస్తున్న నిధుల గురించి బయటి ప్రపంచానికి చెబితే సాయం కోసం మిత్ర దేశాలన్నీ చైనాపై మరింత ఒత్తిడి చేస్తాయని పేర్కొన్నారు. అందుకే ఈ విషయాలేవీ వెల్లడించడం లేదన్నారు.
తన చైనా పర్యటన గురించి ప్రస్తావిస్తూ... జిన్‌పింగ్‌ను కలవడం ద్వారా పాక్- చైనా బంధం మరింత బలపడిందని పేర్కొన్నారు. పాక్ మాజీ ప్రధానులెవరూ సాధించలేనిది తాను సాధించానని.. చైనా సాయంతో వచ్చే ఆరు నెలల్లో తమ దేశ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుందని తెలిపారు. బ్రిటన్, స్విట్జర్లాండ్‌లతో కూడా కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.
కాగా ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా పాటిస్తారా అని విలేకరులు ప్రశ్నించగా.. మంచి జరగుతుందంటే తాను యూటర్న్ తీసుకోవడానికి వెనుకాడబోనని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. దేశ అభివృద్ధి కోసం కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. అయితే మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌లాగా తనకు అబద్ధాలు చెప్పే స్వభావం మాత్రం లేదన్నారు. ఓ క్రికెటర్‌గా మైదానంలో ప్రత్యర్థుల వ్యూహాలను పసిగట్టి వారిని చిత్తు చేసేందుకు ఎటువంటి పంథాను అనుసరించారో.. రాజకీయాల్లో కూడా అదే విధానాన్ని అవలంబించి విజయం సాధిస్తానని ఇమ్రాన్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment