ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రధాన మంత్రిగా తన భర్త ఎన్నికవడం పాక్ ప్రజల అదృష్టమని ఇమ్రాన్ ఖాన్ సతీమణి బుష్రా మనేకా అన్నారు. ఇమ్రాన్ పెళ్లి చేసుకున్న తర్వాత తొలిసారిగా పాక్ మీడియాతో మాట్లాడిన బుష్రా.. భర్తపై ప్రశంసలు కురిపించారు. పాక్ జాతి పిత మహ్మద్ అలీ జిన్నా, టర్కీ అధ్యక్షుడు రెసీప్ తయ్యీప్ ఎర్డోగన్‌ల వలె ఇమ్రాన్ కూడా గొప్ప నాయకుడని ఆమె వ్యాఖ్యానించారు. ‘ఒక జాతి తలరాతను మార్చాలని నిర్ణయించుకున్నప్పుడే ప్రజల కోసం నిస్వార్థంగా పని చేసేందుకు రాజకీయాలు చేసే వ్యక్తిని కాకుండా ఓ నాయకుడిని దేవుడు పంపిస్తాడు. మహ్మద్ అలీ జిన్నా, ఎర్డోగన్‌ల తర్వాత అలా ప్రజల కోసం జన్మించిన వ్యక్తి నా భర్త ఇమ్రాన్. ఈ ముగ్గురు మాత్రమే నిజమైన నాయకులు. ప్రపంచంలోని మిగలిన వ్యక్తులందరూ రాజకీయాలు చేసేందుకు మాత్రమే ఆసక్తి చూపుతారంటూ’ బుష్రా ఇమ్రాన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
తన దగ్గర మంత్రదండం లేదు!
కేవలం ప్రజా సంక్షేమం కోసమే ఇమ్రాన్ ప్రధాని పదవి చేపట్టారన్న బుష్రా.. కేవలం నెలరోజుల్లోనే దేశ స్థితిగతులను మార్చే మంత్ర దండం ఆయన దగ్గర లేదని వ్యాఖ్యానించారు. పాక్ ప్రజలకు ఇప్పుడే శుభకాలం ప్రారంభమైందని.. ఇమ్రాన్ నిలదొక్కుకోవడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి ప్రజలంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
కాగా 1992లో పాక్ జట్టుకు క్రికెట్ ప్రపంచ కప్ సాధించిపెట్టిన తర్వాత విపరీతమైన క్రేజ్‌ను పొందిన ఇమ్రాన్.. తొలుత బ్రిటిష్ జర్నలిస్టు జెమీమాను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల తర్వాత ఆమెతో విడిపోయిన ఖాన్.. మరో జర్నలిస్టు రేహమ్‌ను(2015లో) రెండో పెళ్లి చేసుకున్నారు. పట్టుమని 10 నెలలైనా గడవకముందే ఆ బంధం కూడా తెగిపోయింది. తర్వాత మత గురువైన బుష్రాను మూడో పెళ్లి చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment