ఎన్నో దేశాలకు చేదు జ్ఞాపకాలు
పెచ్చుమీరుతున్న ఉగ్రవాదం... 2014లో ప్రపంచ దేశాలకు ఓ పెద్ద సవాల్‌గా మిగిలింది. ఎబోలా వైరస్ వేలాది మందిని బలితీసుకున్నదీ ఈ ఏడాదిలోనే. వీటికి తోడు విమాన ప్రమాదాలు... ఇలా 2014లో ఎన్నో విషాద ఘటనలను ప్రపంచం ఎదుర్కొన్నది.
ఉక్రెయిన్‌లో ప్రజాగ్రహం... తిరుగుబాటు
ఉక్రెయిన్ ప్రజలు యూరోపియన్ యూనియన్‌తో సంబంధాలను ఆశిస్తుంటే, అధ్యక్ష స్థానంలో ఉన్న యానుకోవిచ్ రష్యాతో సంబంధాలను కోరుకోవడంతో సంక్షోభం రగిలింది. పోలీసులు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణలో వంద మందికిపైగా మృతిచెందారు. యానుకోవిచ్ ఫిబ్రవరి 22న రష్యాకు పరారయ్యారు. తర్వాత రష్యన్లు 60 శాతం ఉన్న క్రిమియాలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ మార్చి 1న తమ సైన్యాన్ని ఉక్రెయిన్ చుట్టూ మోహరించి, క్రిమియాను ఆధీనంలోకి తెచ్చుకున్నారు. రిఫరెండమ్‌లో 97 శాతం క్రిమియన్లు రష్యాలో ఉండేందుకు ఓటేయడంతో అది రష్యాలో కలిసింది.
విమాన విషాదాలు
అత్యధిక విమాన ప్రమాదాలు జరిగిన సంవత్సరంగా 2014 చరిత్రలో నిలిచిపోనుంది. హా మార్చి 8న 239 మందితో కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయల్దేరిన మలేసియా ఎయిర్‌లైన్స్ ఎంహెచ్ 370 విమానం గమ్యాన్ని చేరకుండానే అదృశ్యమైపోయింది. ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోయింది. హా జూలై 17న 298 మందితో ఆమ్‌స్టర్‌డామ్ నుంచి కౌలాలంపూర్‌కు వెళుతున్న మలేసియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ విమానం-17 ఉక్రెయిన్‌లో కూల్చివేతకు గురైంది. అందరూ మృతి చెందారు. హా జూలై 24న 116 మందితో బుర్కినాఫాసో నుంచి అల్జీరియాలోని అల్జీర్స్‌కు వెళుతున్న ఎయిర్ అల్జీర్ విమానం మాలిలో కూలిపోగా ఒక్కరూ బతికి బయటపడలేదు. హా డిసెంబర్ 28న ఇండోనేసియా నుంచి 162 మందితో సింగపూర్ వెళ్తున్న ఎయిర్‌ఆసియా విమానం ఇండోనేసియాలోని సురబయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే అదృశ్యమైంది.
ఎబోలా సవాల్
ఎబోలా అనే ప్రాణాంతక వైరస్ ఈ ఏడాది ప్రపంచ దేశాలను వణికించింది. 2013 డిసెంబర్‌లో గినియాలో కళ్లు తెరచిన ఈ మహమ్మారి ఈ ఏడాది ఆఫ్రికా దేశాలపై బలమైన పంజా విసిరింది. ఇప్పటి వరకు ఈ వైరస్ 7,645 మందిని బలితీసుకోగా, 19 వేల కేసులు నమోదయ్యాయి.
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా
ఇరాక్, సిరియాల్లోని చిన్నచిన్న ఉగ్రవాద సంస్థలన్నీ ఏకమై ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్)గా ఏర్పడ్డాయి. ఇది తన పేరును ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)గా మార్చుకుంది. ఇరాక్‌లో పలు ప్రాంతాలను ఆక్రమించుకుంది. పలు దేశాల వారిని బందీలుగా చేసుకుని వారి తలలు నరికి ఆ వీడియోలను విడుదల చేసింది. ఐఎస్ చెరలో 39 మంది భారతీయులు ఉన్నారు.
పెషావర్ మారణహోమం
పాకిస్తాన్‌లోని పెషావర్ నగరంలో ఉన్న సైనిక పాఠశాలలోకి డిసెంబర్ 16న తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ సంస్థకు చెందిన ఏడుగురు ఉగ్రవాదులు చొరబడి 133 మంది విద్యార్థులను కాల్చి చంపారు.
మరిన్ని ముఖ్యమైన పరిణామాలు..
హా నైజీరియాలో బోకోహరామ్ ఉగ్రవాదులు ఏప్రిల్ 14న ఓ బోర్డింగ్ స్కూల్ నుంచి 276 మంది విద్యార్థినులను అపహరించుకుని పోయారు. హా ఇజ్రాయెల్ దాడుల్లో 2,100 మంది పాలస్తీనా వాసులు మృతిచెందారు. మృతుల్లో ఎక్కువ మంది పిల్లలు హా బ్రిటన్‌తోనే కలిసుండాలా లేక స్వాతంత్య్రం కావాలా? అన్న అంశంపై సెప్టెంబర్‌లో స్కాట్లాండ్‌లో జరిగిన ఓటింగ్‌లో... బ్రిటన్‌తోనే కలసి ఉంటామంటూ మెజారిటీ ప్రజలు తీర్పు ఇచ్చారు.