గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు
337కు చేరిన మృతుల సంఖ్య
ఆశ్రయం కోల్పోయిన 40 వేలమంది పాలస్తీనియన్లు
గాజా/జెరూసలెం: ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గాజా ప్రాంతంలో పాలస్తీనియన్లకు చెందిన హమాస్ స్థావరాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులతో పాటుగా భూతల దాడులనూ ఉధృతం చేసింది. ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు, సాయుధ బలగాలు అంతకంతకూ గాజా ప్రాంతాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. గాజాలోని ఒక ఇంటిపై జరిగిన క్షిపణి దాడిలో నలుగురు చిన్నారులు సహా ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. దక్షిణ ఇజ్రాయెల్‌లోకి చొరబడిన ఉగ్రవాదుల్లో ఒకరిని సైనికులు హతమార్చారని, మిగతావారు వెనుదిరిగి గాజా ప్రాంతంలోకి పరారయ్యారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇజ్రాయెల్ 12 రోజులుగా జరుపుతున్న దాడులతో మృతుల సంఖ్య 337కు చేరింది. దాడులతో 40 వేలమందికి పైగా పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు.
ఇరుపక్షాలను కాల్పుల విరమణకు ఒప్పించేందుకు, సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్, దౌత్యవేత్తలు సన్నద్ధమయ్యారు. పశ్చిమాసియాకు మూన్ పయనమవుతున్నారు. మరోవైపు ఘర్షణ తీవ్రతరమై గాజా ప్రాంతంలో పరిస్థితి మరింత విషమించింది. ఉభయపక్షాలు అంతర్జాతీయ మానవతా చట్టం నిబంధనలను గౌరవించాలని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని సహాయ, కార్యకలాపాల సంస్థ సూచించింది.