
భారత్‌లో ఏటా 11 లక్షల మంది మృతి
ప్రపంచంలో వాయు కాలుష్యానికి 2015 సంవత్సరంలో 42 లక్షల మంది ప్రజలు మరణించగా, వారిలో సగానికి పైగా అంటే, 22 లక్షల మంది ప్రజలు భారత్, చైనా దేశాల్లోనే మరణించారు.
న్యూయార్క్:
ప్రపంచంలో వాయు కాలుష్యానికి 2015 సంవత్సరంలో 42 లక్షల మంది ప్రజలు మరణించగా, వారిలో సగానికి పైగా అంటే, 22 లక్షల మంది ప్రజలు భారత్, చైనా దేశాల్లోనే మరణించారు. అమెరికాలోని ‘హెల్త్ ఎఫెక్ట్స్ ఇనిస్టిట్యూట్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైనట్లు ఆ సంస్థ మంగళవారం ప్రకటించింది. భారత్‌లో 11 లక్షల మంది, చైనాలో కూడా 11 లక్షల మంది ప్రజలు వాయు కాలుష్యం కారణంగా కన్నుమూయడం గమనార్హం. మొత్తంలో 2015 మానవుల ప్రాణాలను హరించిన కారణాల్లో వాయు కాలుష్యం ఐదో స్థానంలో నిలిచింది.
ప్రపంచవ్యాప్తంగా 92 శాతం ప్రజలు వాయుకాలుష్యం ఉన్న పరిసరాల్లోనే జీవిస్తున్నారు. చైనాలో అత్యధికంగా వాయు కాలుష్యం ఉండగా, ఆ తర్వాత స్థానంలో భారత్ ఉంది.
త్వరితగతిన వాయు కాలుష్యం నుంచి బయటపడేందుకు చైనా సత్వర చర్యలు తీసుకుంటుండగా భారత్ మాత్రం తాత్సార ధోరణిని అవలంబిస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో వాహనాల కాలుష్యాన్ని తగ్గించేందుకు కొన్ని చర్యలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. పైగా దేశంలో వాయుకాలుష్యం కారణంగా ప్రజలు మరణిస్తున్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దేవ్ వారం క్రితమే వ్యాఖ్యానించడం గమనార్హం.
1990 నుంచి 2015 సంవత్సరం వరకు భారత్‌లో వాయు కాలుష్యం మృతుల సంఖ్య యాభై శాతం పెరిగిందని అమెరికా సంస్థ వెల్లడించింది. 2016, 2017 సంవత్సరాల్లో కూడా భారత్‌లో ఏటా 11 లక్షల మంది మరణించి ఉంటారని అంచనావేసింది.1990 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడున్నర లక్షల మంది భారతీయులు మరణించారని తేల్చింది. భారత్‌లో విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గును ఎక్కువగా ఉపయోగించడం, వాహన కాలుష్యం, పంటల దుబ్బను తగులబెట్టడం, ధూళి వాయు కాలుష్యం పెరగడానికి ప్రధాన కారణాలవుతున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్‌లను మూసివేసి ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పాదన మార్గాలను అనుసరించక పోవడం వల్లనే భారత్‌లో నానాటికి ఎక్కువ కాలుష్యం పెరుగుతోందని పర్యావరణ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.