లైంగిక రుగ్మతతో జైలుపాలైన భారతీయ బ్యాంకర్
చిన్నవయసులోనే ఉన్నత స్థానానికి ఎదిగిన ఓ భారతీయ బ్యాంకు అధికారి.. ఓ అవలక్షణం కారణంగా దేశంకాని దేశంలో జైలపాలయ్యాడు. అతని పేరు.. మహా విగ్నేశ్ వెలిప్పన్. వయసు..32 ఏళ్లు. గతంలో నిర్వహించిన పదవి.. సింగపూర్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్.
సహోద్యోగులు, పక్కింటి వాళ్లు.. చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా అమ్మాయిలందరినీ నీచ దృష్టితో చూడటం.. వారి శరీర భాగాల్ని రహస్యంగా ఫొటోలు తీయడం విగ్నేశ్ అలవాటు! అతగాడి స్మార్ట్ ఫోన్లో అలాంటివి 596 వీడియోలున్నాయి! 2011లో విగ్నేశ్ బాధితురాలైన ఓ సహోద్యోగిని ధైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుట్టు రట్టైంది. మొత్తం 75 సెక్షన్ల కింద అతడిపై కేసు నమోదయింది. మూడేళ్లపాటు విచారణ జరిపిన సింగపూర్ కోర్టు మంగళవారం అతనికి ఎనిమిదివారాల కఠిన కారాగార శిక్షను ఖరారుచేసింది.
కాగా తన కక్షిదారుడు వాయొరిజం (విపరీత మానసిక లైంగిక రుగ్మత)తో బాధపడుతున్నాడని, ఆ వ్యాధి లక్షణాలవల్లే అతడలా రహస్య ఫొటోలు తీశాడని, పైగా అదే సమయంలో గర్ల్ ఫ్రెండ్తో గొడవపడి ఒంటరిగా ఉడేవాడని విగ్నేశ్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించాడు. దీంతో విగ్నేశ్కు భారీ శిక్ష తప్పినట్లయింది.