లండన్: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడి భారత సంతతి వైద్యురాలు పూర్ణిమా నాయర్(56) మృతిచెందారు. కౌంటీ దుర్హంలో ప్రాక్టీసు చేస్తున్న ఆమె బుధవారం మరణించినట్లు స్థానిక వైద్యాధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో పూర్ణిమా మరణ వార్త తమను తీవ్రంగా కలచివేసిందని ఆమె సహోద్యోగులు విచారం వ్యక్తం చేశారు. మహమ్మారితో ఎంతో ధైర్యంగా పోరాడిన పూర్ణిమ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. పూర్ణిమ కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యాన్ని ఆ దేవుడు ప్రసాదించాలంటూ సానుభూతి తెలిపారు. జాతీయ ఆరోగ్య సేవలో భాగంగా ఆమె ఎంతో మంది పేషెంట్లలో సానుకూల దృక్పథాన్ని నింపారని.. అలాంటి వ్యక్తి ఇప్పుడు తమను వీడి వెళ్లడం బాధాకరమన్నారు. తను ఈ ప్రపంచానికి దూరమైనా.. ఆమె హృదయం మాత్రం ఎన్‌హెచ్‌ఎస్‌తోనే ఉంటుందంటూ భావోద్వేగానికి లోనయ్యారు.(20 ఏళ్లలో 5 వైరస్‌లు అక్కడినుంచే..!)
కాగా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలైన పూర్ణియా నాయర్ 1997లో యూకేకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎంతో మంది రోగులను పరీక్షించిన ఆమె.. మార్చి 27న కరోనా లక్షణాలతో స్టాక్‌టౌన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. నెలన్నర పాటు కరోనాతో పోరాడి ఈరోజు మరణించారు. పూర్ణిమకు తల్లి, భర్త, ఓ కుమారుడు ఉన్నారు. కాగా భారత సంతతి వైద్యులు జితేంద్ర కుమార్ రాథోడ్, మంజీత్ సింగ్ రియాత్, క్రిష్ణన్ అరోరా, రాజేశ్ కల్రియా, పూజా శర్మ, జయేశ్ పటేల్, వివేక్ శర్మ, కమలేశ్ కుమార్, సోఫీ ఫగన్, హంజా పచీరి, అమ్రిక్ బమోత్రా తదితరులను కరోనా బలిగొన్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment