ఐఎస్ ఉగ్రవాదివంటూ.. నోట్లో కాల్చాడు
మిచిగాన్: అమెరికాలో భారత సంతతి వ్యక్తిపై ఓ ఆగంతకుడు దాడి చేశాడు. మిచిగాన్లో సిక్ అమెరికన్ ఇందర్జీత్ సింగ్ నిర్వహిస్తున్నస్టోర్లో భారత్ సంతతికి చెందిన ఓ వ్యక్తి (పేరు వెల్లడించలేదు) క్లర్క్గా పనిచేస్తున్నాడు. గతవారం ముసుగు ధరించిన ఓ దుండగుడు స్టోర్ను దోచుకోవడానికి రాగా క్లర్క్ అడ్డుకున్నాడు. ఆ ఆగంతకుడు.. భారత సంతతి వ్యక్తిని ఐఎస్ ఉగ్రవాదవని దూషిస్తూ ముఖంపై కాల్చాడు.
దోపిడీకి వచ్చిన వ్యక్తి డబ్బులు డిమాండ్ చేశాడని ఇందర్జిత్ కుమార్తె గుర్లీన్ కౌర్ చెప్పారు. క్లర్క్ను స్టోర్లో వెనుకగదిలోకి లాక్కెళ్లి బెదిరించినట్టు తెలిపారు. క్లర్క్ భారత సంతతికి చెందిన వ్యక్తి అయినందుకే దుండగుడు ఐఎస్ ఉగ్రవాదిగా పిలిచాడని చెప్పారు. బాధితుడి నోట్లోకి తుపాకీ పెట్టి కాల్చగా దవడ గుండా బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ తర్వాత ఆగంతకుడు కొంత డబ్బు తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన క్లర్క్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారం రోజుల తర్వాత అతణ్ని డిశ్చార్జ్ చేశారు. దాడి చేసిన దుండగుడు ఎవరన్నది ఇంకా గుర్తించలేదు.