దొంగలను తరిమికొట్టిన ఎన్నారై మహిళ
లండన్: ఇంగ్లండ్ లో భారత సంతతికి చెందిన ఓ మహిళ చూపిన తెగువ ప్రశంసలంటుకుటోంది. చోరులను సమర్థవంతంగా తిప్పికొట్టడంతో ఆమె చూపిన ధైర్యం అందరి మన్ననలు పొందుతోంది. హేమలతా పటేల్(56) అనే మహిళ అసమాన తెగువతో దొంగలను నిలువరించారు.
చేషైర్ ప్రావిన్స్ లోని విన్స్ ఫోర్డ్ పట్టణంలో న్యూస్ ఏజెంట్ స్టోర్ లో ఉండగా ముసుగులు ధరించిన ఇద్దరు దుండగులు లోపలికి చొరబడి దొంగతనానికి యత్నించారు. హేమలతతో పాటు దుకాణంలో ఉన్న ఇద్దరు మహిళలను కత్తితో బెదిరించారు. హేమలత ఏమాత్రం భయపకుండా దొంగలను ఎదిరించారు. పక్కనేవున్న స్టీలు కుర్చీని చేతుల్లోకి తీసుకుని దొంగలను దుకాణం నుంచి తరిమికొట్టారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇది జరిగినప్పుడు హేమలత భర్త దీరుభాయ్, మనవరాళ్లు దుకాణం వెనుకవైపు ఉన్నారు. కేకలు విని వాళ్లందరూ వచ్చేటప్పటకి దొంగలు పారిపోయారు.
తనకేం కాలేదని తెలియడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారని హేమలత తెలిపారు. 30 ఏళ్లుగా తాము ఇక్కడ దుకాణం నిర్వహిస్తున్నామని, 2011లోనూ చోరియత్నం జరిగిందని వెల్లడించారు. దుకాణం వెలుపల ఉన్న క్యాష్ మిషన్ ను పగలగొట్టేందుకు విఫలయత్నం చేశారని, అయితే ఆ సమయంలో తాము షాపులో లేమని చెప్పారు. కాగా, తాజాగా చోరీకి యత్నించిన ఇద్దరు 16, 14 ఏళ్ల బాలురని పోలీసులు గుర్తించారు. వీరిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేశారు.