న్యూజిలాండ్‌లో ఉంటున్న భారత విద్యార్థులు బెదిరింపు ఫోన్ కాల్స్‌తో బెంబేలెత్తిపోతున్నారు.
మెల్‌బోర్న్: న్యూజిలాండ్‌లో ఉంటున్న భారత విద్యార్థులు బెదిరింపు ఫోన్ కాల్స్‌తో బెంబేలెత్తిపోతున్నారు. ఇమిగ్రేషన్ అధికారుల పేరుతో ఫోన్ చేసి వేలాది రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. న్యూజిలాండ్ ఇమిగ్రేషన్ విభాగం నుంచి ఫోన్ చేస్తున్నామని.. మీ వీసా ప్రాసెసింగ్‌లో సమస్యలున్నాయని గానీ లేదా అరైవల్ కార్డు సమాచారంలో లోపాలున్నాయని గానీ చెప్పి బెదిరిస్తున్నారు. దీనికోసం భారత్‌లోని వెస్ట్రన్ యూనియన్ అకౌంట్‌లో డబ్బులు జమ చేయాలని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు ‘ది న్యూజిలాండ్ హెరాల్డ్’ ఓ కథనం లో పేర్కొంది.
భారత్‌కు చెందిన సరిత అన్నపురెడ్డి తాను పొదుపుచేసిన రూ. రెండున్నర లక్షలకుపైగా మొత్తాన్ని ఇలాగే పోగొట్టుకున్నారు. ‘తొలుత నాకు ఫోన్‌కాల్ వచ్చినప్పుడు ఇది నకిలీకాల్‌గా భావించాను. స్నేహితులెవరైనా సరదగాగా ఆటపట్టిస్తున్నారేమోనని అనుకున్నా. అయితే ఆ ఫోన్‌నెంబర్ ఆక్లాండ్ ఇమిగ్రేషన్ నంబర్ లాగే ఉండటంతో నిజమనిపించింది. ఇమిగ్రేషన్ నెంబర్‌కు దీనికి ఒక సున్నా మాత్రమే తేడా ఉంది’ అని సరిత వాపోయారు. అయితే ఇలాంటి ఫోన్‌కాల్స్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని, ఇమిగ్రేషన్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ చేసి బెదిరించరని ఇమిగ్రేషన్ ప్రతినిధి చెప్పారు.