జకార్తా: ఇండోనేషియా ప్రభుత్వం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఓ మొసలి మెడలో ఇరుక్కున్న టైర్‌ను తీసిన సాహసవంతులకు భారీ మొత్తంలో నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించింది. అయితే ఇందుకోసం వారు 13 అడుగుల మొసలికి ఎదురు వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. కాగా ఇండోనేషియా సెంట్రల్ సులవేసిలోని ఉప్పునీటి సరస్సులో నివసిస్తున్న ఈ మొసలి మెడకు మోటర్ సైకిల్ టైర్ ఇరుక్కుంది. రోజు రోజుకు ఆ టైరు మొసలి మెడ నుంచి పొట్టమీదకు జారుతూ బిగుసుకుపోతోంది. కాగా టైరు వల్ల ఇబ్బంది పడుతున్నమొసలి ప్రాణాలకు ప్రమాదం ఉందని గ్రహించిన అధికారులు దానిని తీయడానికి ఈ భారీ ఆఫర్‌ను ప్రకటించారు. అయితే ఆ ఆఫర్‌కు ఆకర్షితులైన కొంత మంది ఈ సాహసానికి పూనుకుని ముందుకు వచ్చారు. ఆ టైర్‌ను తీసేందుకు సరస్సులోకి దిగిన వారు మొసలిని ఎదుర్కొలేక వెనుతిరుగుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కాగా గత కొన్ని రోజులుగా ఇదే పరిస్థితి ఉండటంతో ఆఫర్‌ను ప్రకటించిన ప్రభుత్వ అధికారి ‘ముసలిని రక్షించడానికి వన్యప్రాణ సంరక్షణ నేపథ్యం ఉన్న వ్యక్తుల కోసం చూస్తున్నాము. ఎందుకంటే వారైతేనే ముసలిని రక్షించగలరని నా నమ్మకం. అందుకే ఎంత బహుమతి అనేది పేర్కొన లేదు. వారు అడిగినంత ఇస్తాం’ అని చెప్పారు. ఇక ముసలికి దగ్గరగా వెళ్లొద్దని.. సహజ వనరుల పరిరక్షణ సంస్థ అధికారి హస్ముని హస్మార్ హెచ్చరిస్తున్నారు. దాని జీవితానికి...ఏమాత్రం భంగం కలిగించవద్దని ప్రజలను ఆయన కోరుతున్నారు. అలాగే జంతు ప్రేమికులు కూడా దీనిపై పెద్ద ఎత్తున తమ స్పందనలను తెలుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment