
మతరం(ఇండోనేసియా): ఇండోనేసియాలోని లాంబోక్ దీవిలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 319కి పెరిగింది. భూకంపం అనంతరం ప్రకంపనలు కొనసాగడం వల్లే ప్రాణనష్టం అధికంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండే ఆ ప్రాంతం మరుభూమిగా మారింది. లాంబోక్‌ను ఆదివారం 6.9 తీవ్రతతో భూకంపం కుదిపేసిన సంగతి తెలిసిందే. గురువారం 5.9 తీవ్రతతో వచ్చిన ప్రకంపనలకు భయకంపితులైన ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుంచి పరుగులు పెట్టినట్లు స్థానిక మీడియాలో ప్రసారమైంది. ప్రకంపనలకు దారుణంగా దెబ్బతిన్న రోడ్ల వల్ల లాంబోక్ శిథిలాల్లో చిక్కుకున్న బాధితులను చేరుకోవడం సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి కష్టతరమవుతోంది.