బద్దలైన అగ్నిపర్వతం
జకర్తా: ఇడోనేషియాలో మౌట్ ఎగాన్ అగ్ని పర్వతం విస్ఫోటనమైంది. తూర్పు న్యూసా టెంగ్గారా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ అగ్నిపర్వతం వేడి బూడిదతో పాటు విషపూరిత వాయువులను వెదజిమ్ముతున్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ బుధవారం ప్రకటించింది. దీనికి సమీప ప్రాంతంలో నివసిస్తున్న సుమారు వెయ్యి మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.
మౌట్ ఎగాన్ గత డిసెంబర్ నుండి అడపాదడపా చిన్న చిన్న విస్ఫోటనాలు జరుపుతున్నా బుధవారం విస్పోటనం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సమీప గ్రామంలోని 500 మంది ప్రజలు మాత్రం తమ నివాసాలు ఖాళీ చేయడానికి అంగీకరించలేదని చైనా వార్తా సంస్థ సిన్హువా తెలిపింది. 2008లో మౌంట్ ఎగాన్ భారీ విస్ఫొటనం సమయంలో 6000 మంది సమీప ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇండోనేషియాలో ఉన్న 129 క్రియాశీలక అగ్నిపర్వతాలలో మౌంట్ ఎగాన్ ఒకటి.