![Inmates tried to infect themselves with corona virus in America jail - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/14/California-jail.jpg.webp?itok=4CyW2otD)
లాస్‌ఏంజిల్స్ : జైలు నుంచి విడుదల అవ్వడానికి ఖైదీలు వేసిన కొత్త ఎత్తుగడ బెడిసికొట్టింది. ఏకంగా కరోనా మహమ్మారిని కావాలనే అంటించుకుని ఆ సాకుతో జైలు నుంచి విడుదల అవ్వాలని ప్లాన్ వేశారు. ఈ సంఘటన లాస్ ఏంజిల్స్ కౌంటీ జైలులో చోటుచేసుకుంది. ఒకరు తాగిన నీళ్లు మరొకరు తాగుతూ, ఒకరు ఛీదిన మాస్కును మిగతా ఖైదీలు ధరిస్తూ.. ఇలా ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాపించేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరించడంతో కేవలం రెండు వారాల్లోనే దాదాపు 30 మంది ఖైదీలకు కరోనా వ్యాధి సోకింది.
జైలులోని రెండు గదుల్లో ఉన్న ఖైదీలు కావాలనే కరోనా వ్యాపించేలా వ్యవహరించిన సీసీటీవీ వీడియో ఫుటేజీని ఉన్నతాధికారి అలెక్స్ విలాను మీడియా సమావేశంలో విడుదల చేశారు. కరోనా సోకినంత మాత్రాన విడుదల చేస్తామని ఖైదీలు తప్పుగా భావించారని ఆయన చెప్పారు. ప్రస్తుతం కరోనా సోకిన ఖైదీల పరిస్థితి బాగానే ఉందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా కరోనా వ్యాధి వ్యాపించేలా చేసిన ఖైదీలపై చట్టపరంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే ఖైదీలెవరూ తాము కావాలనే అలా చేయలేదని చెబుతున్నారని, వారి ప్రవర్తన చూస్తే తప్పు చేసినట్టు స్పష్టంగా తెలుస్తుందన్నారు. కాగా, అమెరికా వ్యాప్తంగా దాదాపు 25000 మంది ఖైదీలకు కరోనా సోకగా, 350 మంది ఖైదీలు మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment