డొనాల్డ్ ట్రంప్-ఖ్వాసీం సోలిమని (ఫైల్‌ఫోటో)
టెహ్రాన్ : అగ్రరాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతకొంత కాలంగా ఇరు దేశాల అధ్యక్షుల మధ్య ట్విటర్ వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇరాన్ సైన్యాధికారి మేజర్ జనరల్ (ఎలైట్ రివల్యూషనరీ గార్డ్) ఖ్వాసీం సోలిమని డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌ను కించపిరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే తీవ్రం పరిణామాలు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు.
అతను శుక్రవారం మీడియా మాట్లాడుతూ...‘అమెరికా మాకు చాలా దగ్గరగా ఉంటుంది, మీరు ఉహించని రీతిలో మా సైన్యం మీ ముందుంటుంది. మీరు యుద్ధం ప్రారంభిస్తే మేం ముగిస్తాం. ఇరాన్ యుద్ధం చేస్తే మీరు సర్వం కోల్పోతారన్న విషయం మీకు బాగా తెలుసు. ఇరాన్‌పై మీరు చేస్తున్న బెదిరింపు వ్యాఖ్యలపై ఓ సైన్యాధికారిగా స్పందించాల్సిన అవసరం నాకుంది. మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలనుంటే నాతో మాట్లాడండి. మా దేశ అధ్యక్షుడితో కాదు. మీతో మాట్లాడితే మా దేశ అధినేతకి గౌరవంగా ఉండదు’ అంటూ సోలిమాని ట్రంప్‌ను హెచ్చరించాడు.
ఇరాన్‌కు వ్యతిరేకంగ ట్రంప్ కుట్ర పన్నుతున్నారని ఇటీవల ఆ దేశ అధ్యక్షుడు హాసన్ రౌహానీ పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. పులితో ఆటలొద్దని, ఇరాన్‌తో యుద్ధమంటే యుద్దాల తల్లితో పోరాడటమే అంటూ ట్రంప్‌ను హెచ్చరించారు. నేనేమే తక్కువ తినలేదంటూ ట్రంప్ కూడా అంతే రీతిలో స్పందించారు. అమెరికాను ఇప్పటికి, ఎప్పటికి ఎవ్వరు ఏం చేయలేరని, అమెరికాతో జాగ్రత్తగా ఉండాలంటూ రౌహానీకి గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాగా 2015లో ఇరాన్ న్యూక్లియర్ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ప్రచ్చన యుద్ధం కొనసాగుతూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment