
చైనాకు దడ పుట్టిస్తున్న పాట
బీజింగ్: పారిస్ దాడులతో అగ్రరాజ్యాలను గజగజలాడిస్తున్న ఐఎస్ఐఎస్ మరో అగ్రదేశం చైనాను టార్గెట్ చేసింది. చైనాలో తన బలం పెంచుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలోనే 'ఆయుధాలతో యుద్ధానికి సిద్ధం కండి 'అంటూ చైనా భాషలో ఉన్న ఒక పాటను నెట్‌లో పోస్ట్ చేసింది. జిహాదాలజీ అనే వెబ్‌సైట్‌లో నాలుగు నిమిషాల నిడివితో ఉన్న పాటను ఆదివారం పెట్టింది.
చైనాలోని ముస్లింలను ఉద్దేశించి ఉన్న 'ఐ యామ్ ముజాహిద్' అనే పాటను షేర్ చేసింది. 'యుద్ధభూమిలో అమరులవ్వాలనే మన కలను నిజం చేసుకునే సమయం ఆసన్నమైంది.. ఏ శక్తీ మనల్ని ఆపలేదు.. సిగ్గులేని శత్రువు గుండెల్లో గాభరా పుట్టాలి' అంటూ సాగే ఈ పాట ప్రకంపనలు పుట్టిస్తోంది.
కాగా చైనాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ తన ఉనికిని చాటుకునే మొదటి ప్రయత్నమని విశ్లేషకులు అంటున్నారు. తన పరిధిని విస్తరించుకునే పనిలో భాగంగానే ఐఎస్ఐఎస్ ఈ చర్యకు పూనుకున్నట్టు భావిస్తున్నారు.
కాగా చైనాలో టీచర్‌గా పనిచేస్తున్న ఫాన్ జింగ్హుయ్‌ను గతంలో ఇస్లామిక్ స్టేట్ కిడ్నాప్ చేసి హతమార్చిన తర్వాత చైనా తన ధోరణిని మార్చుకుంది. ఆ సంస్థ వైపు కన్నెత్తి కూడా చూడని చైనా.. ఒక్కసారిగా అగ్గిమీద గుగ్గిలమైంది. అటు మాలీ, పారిస్ దాడుల తర్వాత ప్రపంచదేశాలు తీవ్రవాదంపై ఉమ్మడిగా పోరాడాలనే నినాదం ఊపందుకుంది.