గూగుల్ అనుకొని...
‘యాడ్‌గూగుల్’ను హ్యాక్ చేసిన ఐసిస్
లండన్: దిగ్గజ సెర్చింజన్ గూగుల్‌ను నేలకు దించుతామని ప్రతిన బూనిన ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ పొరపాటున ఆపేరుతో ఉన్న ఒక చిన్న భారతీయ కంపెనీని హ్యాక్ చేసింది. మీడియా కథనాల ప్రకారం ఐఎస్‌ఐఎస్ అనుబంధ హ్యాకింగ్ గ్రూప్ సైబర్ కాలిఫేట్ ఆర్మీ (సీసీఏ) భారత్‌కు చెందిన గాందాని కె అనే వ్యక్తి పేరుమీద రిజిస్టరైన యాడ్‌గూగుల్‌ఆన్‌లైన్.కామ్ అనే సంస్థను హ్యాక్ చేసింది. ఈ సంస్థ స్థానిక కంపెనీలకు సెర్చింజన్ సేవలు అందిస్తోంది. ‘మేము సోమవారం గూగుల్‌ని హ్యాక్ చేస్తామని ప్రకటించాం. భగవంతుని దయవల్ల అది ఈ రోజే జరగొచ్చు’ అని సీసీఏ గురువారం ప్రకటించింది.
ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే యాడ్‌గూగుల్‌ఆన్‌లైన్.కామ్ వెబ్‌సైట్‌పై హ్యాకర్లు దాడి చేశారు. హ్యాకింగ్‌కు గురైన తరువాత వెబ్‌సైట్‌లో ఇస్లామిక్‌స్టేట్‌కు సంబంధించిన పాట ఫ్రెంచ్‌లో వినిపించడంతో పాటు ఐఎస్ లోగో కనిపించింది. సీసీఏ హ్యాక్ చేసినట్లు వెబ్‌సైట్‌లో ఇండికేషన్ వచ్చింది. ఇది జరిగిన కొద్ది సేపటికే మరో హ్యాకింగ్ గ్రూప్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి ఐఎస్ మెస్సేజ్‌ను చెరిపేసింది. యూకే మీడియా కథనం ప్రకారం ఇప్పటి వరకు 35 బ్రిటిష్ వెబ్‌సైట్లను ఐఎస్ హ్యాక్ చేసింది.