వాషింగ్టన్/బీజింగ్: గడిచిన రెండు రోజులుగా దాదాపు ప్రపంచమంతా ‘ట్రంప్-కిమ్ భేటీ’ గురించే మాట్లాడుకుంది. సింగపూర్‌లోని సెంతోసా దీవిలో గల రిసార్టులో సుదీర్ఘంగా చర్చలు జరిపిన అమెరికా-ఉత్తరకొరియా దేశాధినేతలు ఎట్టకేలకు ఉమ్మడిగా శాంతిసందేశాన్ని ఇచ్చారు. సుమారు 40 గంటలు సాగిన కార్యక్రమ ఖర్చు రూ.100కోట్ల పైమాటే. ఇరుదేశాల మేలు కోరే మిత్రురాలు సింగపూరే ఖర్చంతా భరించింది. ఈ చరిత్రాత్మక సన్నివేశాన్ని కవర్ చేయడానికి ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 3 వేల మంది జర్నలిస్టులు తరలివెళ్లారు. ఉత్తరకొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణ సహా పలు ఒప్పందాలపై సంతకాలు చేసిన ఇరునేతలు ప్రశాంతంగా తమ తమ దేశాలకు పయనమయ్యారు. ఇదిలా ఉంటే, కిమ్-ట్రంప్ భేటీపై అమెరికా అధ్యక్షుడి కూతురు, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ చేసిన కామెంట్ తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇవాంకా ట్వీట్ వైరల్: అణుబాంబులు వేస్తానని బెదిరించినా, చివరికిప్పుడు అమెరికాతో చర్చలకు ముందుకొచ్చినా కిమ్ జాంగ్ వెనకున్నది చైనాయే అన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా, ఓ చైనీస్ సామెత ఇదంటూ ఇవాంకా చేసిన ట్వీట్‌పై డ్రాగన్ దేశస్తులు జుట్టు పీక్కుంటున్నారు. ‘Those who say it can not be done, should not interrupt those doing it -Chinese Proverb (ఇది అసాధ్యమని అన్నవాళ్లంతా సుసాధ్యం అవుతున్నవేళ ఆటంకాలు కల్గించొద్దు- చైనీస్ సామెత)’ అని ఇవాంకా రాశారు.
బ్రెయిన్ ఎగ్జాస్టెడ్!: అసలే భాషా(వీరా)భిమానులైన చైనీయులు.. ఇవాంకా చెప్పిన సామెత ఎక్కడిదా? అని సెర్చింగ్ మొదలెట్టారు. చివరాఖరికి అలాంటి అర్థాన్నిచ్చే సామెత ఏదీ తమ భాషలో లేదనే నిర్ధారణకు వచ్చారు. చైనీస్ సోషల్ మీడియా వేదికలైన వీచాట్, వెయిబో, క్యూక్యూల్లో ఇవాంకా పోస్టుపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ‘‘వామ్మో ఇవాంకా.. ఒక్క సామెతతో మా మెదడు నరాలను తెంపేశావుగా!’’ అని కొందరు, ‘‘ మీ రాతల్లో అర్థం ఉన్నా, సామెత మాత్రం ఇక్కడిది కాదు’’అని ఇంకొందరు, ‘‘బహుశా పాండా ఎక్స్‌ప్రెస్ రెస్టారెంట్‌లో ఫార్చూన్ కుకీ(లోపల చైనీస్ సామెత రాసుండే బిస్కెట్)లో ఆమెకిది దొరికి ఉండొచ్చు..’’ అని మరొకరు కామెట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment