అది రాదు.. ఇక ప్రశాంతంగా నిద్రపోండి! | There Is No Longer A Nuclear Threat From North Korea Says Donald Trump | Sakshi
Sakshi News home page

అది రాదు.. ఇక ప్రశాంతంగా నిద్రపోండి!

Published Wed, Jun 13 2018 5:46 PM | Last Updated on Mon, Jul 29 2019 5:39 PM

There Is No Longer A Nuclear Threat From North Korea Says Donald Trump - Sakshi

వాషింగ్టన్‌: సింగపూర్‌ వేదికగా ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌తో చరిత్రాత్మక చర్చల అనంతరం స్వదేశానికి చేరుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికన్లకు శుభవార్త చెప్పారు. ఇన్‌ఫ్యాక్ట్‌ అది ప్రపంచానికి కూడా శుభవార్తే అవుతుందేమో!! ‘‘సుదీర్ఘ ప్రయాణం చేసి ఇప్పుడే విమానం దిగాను. నేను అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టినరోజు కంటే ఇవాళ అమెరికన్లు మరింత సురక్షితంగా ఉన్నారని భావించండి. మున్ముందు ఉత్తరకొరియా నుంచి అణుబాంబుల బెదిరింపులేవీ ఉండవు. అసలు యుద్ధమన్నమాటే రాదు. కాబట్టి మీరంతా ప్రశాంతంగా నిద్రపోండి. అమెరికాకు ఉత్తరకొరియానే అతిపెద్ద శత్రువన్న ఒబామా మాటలకు కాలం చెల్లింది. కిమ్‌ దేశానికి మంచి భవిష్యత్తు ఉంది..’’ అని ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. (చదవండి: ట్రంప్, కిమ్‌ శాంతి మంత్రం)

విమానం దిగుతూనే తూటాలవర్షం: కిమ్‌ జాంగ్‌తో భేటీ కోసం ఆదివారమే సింగపూర్‌ వెళ్లిన డొనాల్డ్‌ ట్రంప్‌.. మంగళవారం రాత్రికి తిరిగి అమెరికా చేరుకున్నారు. విమానం దిగుతూనే ట్విటర్‌ నుంచి మాటల తూటాల వర్షం కురిపించారు. తాను ఊళ్లోలేని సమయంలో దారుణంగా తిట్టిపోసిన వెటరన్‌ సినీ నటుడు రాబర్ట్‌ డీనిరోకు ట్రంప్‌ ఘాటు కౌంటర్‌ ఇచ్చారు. ‘‘రాబర్ట్‌ డీ నిరో ఓ తెలివితక్కువోడు. సినిమాల్లో ఎంతోమంది చేతుల్లో చావుదెబ్బలు తిన్నవాడు. అతను మాట్లాడింది చూశా.. ఫుల్లుగా మద్యం తాగి వాగాడేమో!’’ అని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో నటుడు రాబర్ట్‌.. ట్రంప్‌ను అసభ్యపదజాలంతో దూషించిన సంగతి తెలిసిందే.

తర్వాతి టార్గెట్‌ ఇరాన్‌: ఉత్తరకొరియాతో శాంతి చర్చలు సఫలంకావడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇక ఇరాన్‌పై దృష్టి సారిస్తానన్నారు. సింగపూర్‌ను వీడబోయే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. ఒబామా హయాంలో ఇరాన్‌–ఆరు అగ్ర దేశాల మధ్య కుదిరిన అణు నిరోధక ఒప్పందం నుంచి ఇటీవలే అమెరికా వైదొలిగిందని గుర్తుచూస్తూ నిబంధనల్లో మార్పులు చేసి ఇరాన్‌తో సరికొత్త, వాస్తవిక ఒప్పందం కుదర్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ‘‘ప్రస్తుతం ఇరాన్‌పై విధించిన ఆంక్షలు అమలులోకి వచ్చాక ఆ ప్రభావంతో తగిన సమయంలో వారే చర్చలకు వస్తారు. గడిచిన నాలుగు నెలల్లో ఆ దేశ వైఖరిలో వచ్చిన మార్పును బట్టి నేనిలా ఆశిస్తున్నాను. వాళ్లు(ఇరాన్‌) గతంలో మాదిరిగా సిరియాకు మద్దతుగా నిలవడంలేదని అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ల ఆత్మ విశ్వాసం తగ్గింది’’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement