
మంత్రి కుమారుడు సేఫ్.. వీడని మిస్టరీ!
కిడ్నాప్నకు గురైన మంత్రి తనయుడు ఎట్టకేలకు మిలిటెంట్ల చెర నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. గత మే 20న పాకిస్తాన్ లోని సమస్యాత్మక ప్రాంతం బలోచిస్తాన్ కు చెందిన మంత్రి సర్దార్ ముస్తఫా తారీన్ కుమారుడు అసద్ తారీన్ ను కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇంతలో కొందరు సాయుధులు పిషిన్ జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో అసద్ ను అడ్డగించి అపహరించారు. అసద్ కోసం ఎంత వెతికినా ప్రయోజనం లేకపోయింది.
ఈ క్రమంలో డోలాంగి ఏరియాలో అసద్ తారీన్ను తాము రక్షించామని పిషిన్ డిప్యూటీ కమిషనర్ అబ్దుల్ వాహిద్ కాకర్ తెలిపారు. పాక్-ఆఫ్గన్ సరిహద్దుల్లో దొరికిన అసద్ ను పటిష్ట భద్రత మధ్య అక్కడి నుంచి క్వెట్టాకు తరలించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలను ఆయన బహిర్గతం చేసేందుకు నిరాకరించారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి అసద్ను రక్షించారా.. లేక కిడ్నాపర్లు డిమాండ్ చేసిన మొత్తాన్ని వారికి ఇచ్చివేసి కాపాడారా అన్న విషయంపై ఇప్పటివరకూ స్పష్టతలేదు. గతంలోనూ సల్మాన్ తసీర్ అనే వ్యక్తి కిడ్నాప్నకు గురైన ఐదేళ్ల తర్వాత ఉగ్రవాదుల చెర నుంచి బయటపడ్డ విషయం తెలిసిందే.