వీసా రూల్స్‌నే మార్చేసిన పండు! | Kiwi fruit changed visa rules in New Zealand | Sakshi
Sakshi News home page

వీసా రూల్స్‌నే మార్చేసిన పండు!

Published Sun, May 13 2018 2:30 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

Kiwi fruit changed visa rules in New Zealand - Sakshi

న్యూజిలాండ్‌ ప్రజల ప్రధాన జీవనాధారమైన కివీ పండు.. ఆ దేశ విదేశాంగ చట్టంలోనే మార్పులకు కారణమైంది తెలుసా? వీసా రూల్స్‌ను మార్చేసేందుకు, పర్యాటక వీసాలపై వచ్చే వారు కూడా దేశంలో పనిచేసి డబ్బు సంపాదించుకునేలా అవకాశం కల్పించేందుకు కారణమైంది. అదెలాగో చూద్దామా.. న్యూజిలాండ్‌ జాతీయ ఫలం కివీయే.

అందుకే ఆ దేశ ప్రజలను కివీస్‌ అని ముద్దుగా పిలుస్తారు. కివీ పండ్ల ఉత్పత్తిలో తొలి రెండు స్థానాల్లో చైనా, ఇటలీ ఉంటే.. న్యూజిలాండ్‌ మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఆ దేశ ఆర్థికాభివృద్ధిలోనూ ఈ చిన్ని ఫలానిదే ముఖ్యమైన పాత్ర కావడం విశేషం. 2008–2009 సీజన్‌లో న్యూజిలాండ్‌ కివీ ఫ్రూట్‌ ఎగుమతుల విలువ 1.45 బిలియన్‌ న్యూజిలాండ్‌ డాలర్లు.

అయితే ఇదే ఇప్పుడు ఆ దేశానికి వచ్చే విజిటర్స్‌ వీసా రూల్స్‌ని మార్చేసింది. న్యూజిలాండ్‌లో విరగ కాసే కివీ పండ్లను కోసేందుకు కార్మికుల కరువొచ్చిపడింది. విరివిగా కివీ పంట పండుతున్నా అవసరమైన కార్మికులు దొరకక ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయాన్ని ఆ దేశం అధికారికంగా ప్రకటించింది కూడా. గత దశాబ్ద కాలంలో ఇదే సీజనల్‌ లేబర్‌ షార్టేజ్‌ అని కూడా పేర్కొంది.

వీసా రూల్స్‌నే మార్చేసి..
అధిక వేతనాలిచ్చినా కార్మికుల కొరత తీరక.. పక్క దేశాల నుంచి కార్మికులను తెప్పించుకోవాలని నిర్ణయించింది న్యూజిలాండ్‌ ప్రభుత్వం. ఇందుకోసం వీసా నిబంధనలను సరళతరం చేసింది. సాధారణంగా ఉత్పత్తులను దాచుకోవడానికి వీలుంటుంది. కానీ పండ్లను మాత్రం వీలైనంత త్వరగా వాడేయాల్సిందే. లేదంటే కుళ్లిపోతాయి. ఎగుమతి చేయాల్సిన సమయం దాటిపోతే కివీ పండ్లను చెట్లమీదో, తెంపాకో మురిగిపోతుంటే చూడటమే తప్ప చేసేదేమీ ఉండదని ఆ దేశ ప్రధాని జెసిందా ఆర్డెర్న్‌ అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తక్షణమే విదేశీ లేబర్‌ను రప్పించుకోవాలని న్యూజిలాండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం వీసా నిబంధనలను సవరించి మరీ సులభంగా విదేశీ కార్మికులు వచ్చేలాగా వీలుకల్పించింది. కివీ పండ్లను కోసేందుకూ, ప్యాకింగ్‌ చేసేందుకు ఈ కార్మికుల సేవలను వినియోగించుకోనుంది. ఈ విభాగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం గంటకు 16.50 న్యూజిలాండ్‌ డాలర్లుగా కూడా నిర్ణయించింది.

పర్యాటక వీసాపైనా పనిచేయొచ్చు..
సాధారణంగా పర్యాటక (విజిటర్‌) వీసాతో ఏ దేశానికైనా వెళ్లేవారు.. అక్కడ ఉద్యోగం చేసే వీలుండదు. కానీ న్యూజిలాండ్‌ పర్యాటక వీసాలపై వచ్చే వారు కూడా ఆరు వారాల పాటు పనిచేసుకోవడానికి వీలు కల్పించేలా సీజనల్‌ వర్క్‌ పర్మిట్‌ ఇస్తుండటం గమనార్హం. ప్రత్యేక పరిస్థితుల కారణంగా విజిటర్స్‌ వీసాపై న్యూజిలాండ్‌లో కార్మికుల కొరత ఉన్న బే ఆఫ్‌ ప్లెంటీ రీజియన్‌లో ఆరు వారాల పాటు పనిచేసేందుకు అనుమతిస్తున్నట్టు న్యూజిలాండ్‌ ప్రకటించింది.

న్యూజిలాండ్‌ సామాజికాభివృద్ధి శాఖ.. టాస్‌మాన్, బే ఆఫ్‌ ప్లెంటీ ప్రాంతాలను కార్మికుల కొరత ఉన్న ప్రాంతాలుగా ఇప్పటికే ప్రకటించింది. టాస్‌మాన్‌లో ఏప్రిల్‌ 5 నుంచి మే 18 వరకూ, బే ఆఫ్‌ ప్లెంటీలో మే 7 నుంచి, జూన్‌ 8 వరకు విజిటర్స్‌ వీసాపై వర్క్‌పర్మిట్‌ ఇస్తారు. దీనిపై ఒక్కసారి మాత్రమే ఉపాధికి అవకాశం ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement