వైరస్ లేదని తేలడంతో ఢిల్లీలోని ఐటీబీపీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్న భారతీయులు
బీజింగ్/తైపీ/టోక్యో/న్యూఢిల్లీ: కోవిడ్ మృతులతోపాటు బాధితుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో చైనా మరిన్ని కఠిన చర్యలు ప్రకటించింది. పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు ప్రకటించిన ప్రభుత్వం.. వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్న హుబే ప్రావిన్స్‌లో ట్రాఫిక్ ఆంక్షలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో జనం గుమికూడరాదని ఆదేశాలు జారీ చేసింది. వైరస్ భయంతో మార్చి 5వ తేదీన జరగాల్సిన దేశ అత్యున్నత నిర్ణాయక మండలి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్‌పీసీ) సమావేశాన్ని వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికార మీడియా జిన్హువా పేర్కొంది. అదనంగా 30 వేల వైద్య సిబ్బందిని వుహాన్‌నగరానికి పంపుతున్నట్లు ప్రకటించింది. దేశం మొత్తమ్మీద ఉన్న ఇంటెన్సివ్ కేర్ వైద్యుల్లో 10 శాతం మంది.. 11వేల మందిని వుహాన్ పంపామని తెలిపింది.
కోవిడ్‌తో సోమవారం ఒక్కరోజే 105 మృతి చెందటంతోపాటు, 2,048 మంది బాధితులను కొత్తగా గుర్తించటంతో మొత్తం మృతుల సంఖ్య 1,770కు, బాధితుల సంఖ్య 70, 548కు చేరుకుందని చైనా ప్రభుత్వం తెలిపింది. కోవిడ్ భయంతో జపాన్ రాజధాని టోక్యో తీరంలో నిలిపేసిన ఓడలో మరో 99 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణైంది. దీంతో ఓడలోని 3,711 మందిలో 454 మందికి వ్యాధి నిర్థారణ కాగా ఇందులో నలుగురు భారతీయులున్నట్లు సమాచారం. కోవిడ్ భయంతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో సంచరించడంపై ఆంక్షలు విధించిన జపాన్ ప్రభుత్వం.. తాజాగా తమ చక్రవర్తి జన్మదిన వేడుకలను ప్రజలు బహిరంగంగా జరుపుకోవద్దని కోరింది.S 23వ తేదీన పుట్టిన రోజు నాడు చక్రవర్తి నరుహిటో ప్రజలకు కనిపించరని పేర్కొంది. మార్చి 1వ తేదీన జరగాల్సిన టోక్యో మారథాన్‌ను కూడా రద్దు చేశారు.
హుబే నుంచి భారతీయులను తీసుకువస్తాం
చైనా వైద్య సిబ్బందికి అవసరమైన మాస్కులు, గ్లవ్‌లు, సూట్స్, తదితర సామగ్రితో కూడిన ప్రత్యేక విమానాన్ని ఈవారంలో వుహాన్‌కు పంపనున్నట్లు భారత్ తెలిపింది. ఈ విమానం తిరుగు ప్రయాణంలో హుబే నుంచి వెనక్కి రావాలనుకునే భారతీయులతోపాటు ఇరుగుపొరుగు దేశాల వారిని తీసుకువస్తుందని పేర్కొంది.
చెన్నైలో చైనా పిల్లి కలకలం
సాక్షి ప్రతినిధి, చెన్నై: చైనా నుంచి నౌకలో వచ్చిన ఓ పిల్లి కలకలం రేపింది. చైనా నుంచి వచ్చిన ఓ కంటైనర్‌లోని బోనులో ‘స్టో వేవే’జాతి పిల్లి ఉంది. అలాగే, కంటైనర్ల నడుమ సింహాలు సంచరిస్తున్నాయంటూ సోషల్ మీడియాలో వచ్చిన వాట్సాప్ వీడియోపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment