లాస్‌వెగాస్: మ్యూజిక్ కన్సార్ట్‌లో మారణహోమం సృష్టించి 58 మందిని బలిగొన్న లాస్‌వెగాస్ షూటర్ స్టీఫెన్ పెడాక్ పక్కా ప్రణాళికతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆధునిక అమెరికా చరిత్రలో ఏ వ్యక్తీ చేయని విధంగా దశాబ్ధాల తరబడి పెడాక్ ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని సేకరించి నిల్వ చేశాడని, వ్యూహాత్మకంగానే మెరుపు దాడికి దిగాడని అధికారులు భావిస్తున్నారు.అయితే ఇంతటి నరమేథానికి 64 ఏళ్ల పెడాక్‌ను పురిగొల్పిందేమిటన్నది మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలింది. గుంభనంగా ఉంటూ రహస్య జీవితం గడిపేందుకు మొగ్గు చూపే పెడాక్ ఏళ్ల తరబడి ఆయుధాలను నిల్వ చేస్తూ మృత్యు ఘంటికలు ఎందుకు మోగించాడనేదే ప్రశ్నగా ముందుకొస్తున్నదని లాస్‌వెగాస్ షెరీఫ్ జోసెఫ్ లాంబర్డో పేర్కొన్నారు.
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కేవలం పెడాక్ ఒక్కడే సేకరించి, నిల్వ చేశాడనడం ఊహకందని విషయమన్నారు. ఈ ప్రక్రియలో పెడాక్‌కు ఎవరో ఒకరు సహకరించి ఉంటారని అభిప్రాయపడ్డారు. మరోవైపు కాల్పుల ఘటన అనంతరం సజీవంగా బయటపడేందుకు పెడాక్ ప్రయత్నించాడనేందుకు ఆధారాలున్నాయని చెప్పారు. మ్యూజిక్ కన్సార్ట్ జరిగిన వేదికకు దగ్గరలోని ఓ హోటల్‌లో రూమ్ బుక్ చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలిందని తెలిపారు. ఇక మారణకాండ చోటుచేసుకున్న హోటల్ సూట్ నుంచి, మరో మూడు ప్రాంతాల నుంచీ పోలీసులు దాదాపు 50 వరకూ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు.
వీటిలో 15 రైఫిళ్లలో బుల్లెట్లు నింపిఉన్నాయని చెప్పారు. ఇవన్నీ ఆటోమేటిక్ వెపన్స్ అని, పెడాక్ 2016 అక్టోబర్‌లోనే 30కి పైగా గన్‌లను కొనుగోలు చేశాడని విచారణలో తేలిందన్నారు.మరోవైపు కాల్పుల ఘటన వెనుక ఉగ్రవాద కుట్ర దాగుందని ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ అరోన్ రోజ్ చెప్పారు. ఇక పెడాక్ గర్ల్‌ఫ్రెండ్ డాన్లీని ఎఫ్‌బీఐ అధికారులు ప్రశ్నించగా పెడాక్ ఆలోచనల గురించి తనకు తెలియదని తేల్చిచెప్పినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment