shooter gunshots
-
‘ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకే వచ్చా’.. షూటర్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆయనతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులకు పాల్పడిన దుండగుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇమ్రాన్‌ను హత్య చేసేందుకే తాను వచ్చానని, ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే ఇలా చేశానని పేర్కొన్నాడు. ‘ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు మాత్రమే వచ్చా.’ అని కెమెరా ముందు చెప్పాడు దుండగుడు. గుజ్రాన్‌వాలాకు బైక్‌పై వచ్చానని, తన బంధవు ఇంట్లో బండిని పార్క్ చేసి ర్యాలీకి వచ్చినట్లు వెల్లడించాడు. మరోవైపు.. ఇమ్రాన్ ర్యాలీలో ఇద్దరు షూటర్లు పాల్గొన్నట్లు సమాచారం. ఒకరు పిస్టల్‌తో రాగా.. మరొకరు ఆటోమెటిక్ రైఫిల్‌తో ఉన్నారని పలు మీడియాలు వెల్లడించాయి. మరోవైపు.. కాల్పుల్లో కాలికి తీవ్రంగా గాయమైన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు గాయపడ్డారు. ఈ క్రమంలో ఇమ్రాన్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని నిలువరించిన పార్టీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. ఆయనను హత్య చేసేందుకు జరిగిన దాడిగా పార్టీ సీనియర్ నేత రవూఫ్ హసన్ ఆరోపంచారు. ఇదీ చదవండి: Imran Khan Rally: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో ఫైరింగ్.. నలుగురికి గాయాలు -
దుండగుడు చంపాలనుకుంది అబేను కాదట.. కానీ!
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే గురువారం దారుణ హత్యకు గురవటం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నారా ప్రాంతంలోని రైల్వే స్టేషన్ ముందు ప్రసంగిస్తున్న సమయంలోనే దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు అబే. ఈ ఘాతుకానికి పాల్పడింది కొన్నేళ్ల క్రితం నౌకాదళంలో పని చేసిన తెత్సుయ యమగామి(41)గా గుర్తించారు పోలీసులు. అయితే.. తాను మొదట చంపాలనుకుంది అబేను కాదని పోలీసులకు తెలిపినట్లు జపాన్ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఓ మత సంస్థకు చెందిన గురువును హత్య చేయాలని అనుకున్నట్లు పేర్కొన్నాయి. మత సంస్థపై తనకు కోపం ఉందని, దానితో షింజో అబేకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతోనే హత్యకు పాల్పడ్డానని పోలీసులతో చెప్పినట్లు క్యోడో న్యూస్ తెలిపింది. అబే రాజకీయ విశ్వాసలను వ్యతిరేకిస్తున్న క్రమంలో తాను నేరం చేశానని భావించటం లేదని పేర్కొన్నట్లు వెల్లడించింది. అయితే.. ఆ మత గురువు ఎవరనే విషయం తెలియరాలేదు. నౌకాదళంలో మూడేళ్లు విధులు: మీడియా కథనాల ప్రకారం.. దుండగుడు యమగామి తన హైస్కూల్ విద్య తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై స్పష్టత లేదని తేలింది. తన గ్రాడ్యూయేషన్ ఇయర్ బుక్‌లో సైతం అదే రాశాడు. ప్రభుత్వ వర్గాల ప్రకారం అతడు 2005లో హిరోసిమా, క్యూర్ బేస్‌లోని నౌకాదళంలో చేరి మూడేళ్లు పని చేశాడు. 2020లో కన్సాయి ప్రాంతంలోని ఓ తయారీ సంస్థలో ఉద్యోగంలో చేరిన యమగామి.. దానిని సైతం రెండు నెలల క్రితమే మానేశాడు. అలసిపోయాననే కారణం చెప్తూ.. ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. దుండగుడి ఇంట్లో పేలుడు పదార్థాలు, తుపాకులు: నారా ప్రాంతంలోని అతని అపార్ట్మెంట్లో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. అతని ఇంటి నుంచి పేలుడు పదార్థాలు, నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. షింజో అబే భౌతికకాయాన్ని శుక్రవారం టోక్యోకు తరలించారు. మంగళవారం అంతిమసంస్కారాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్ -
స్కెచ్ వేసి..గురి చూసి...
లాస్‌వెగాస్: మ్యూజిక్ కన్సార్ట్‌లో మారణహోమం సృష్టించి 58 మందిని బలిగొన్న లాస్‌వెగాస్ షూటర్ స్టీఫెన్ పెడాక్ పక్కా ప్రణాళికతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆధునిక అమెరికా చరిత్రలో ఏ వ్యక్తీ చేయని విధంగా దశాబ్ధాల తరబడి పెడాక్ ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని సేకరించి నిల్వ చేశాడని, వ్యూహాత్మకంగానే మెరుపు దాడికి దిగాడని అధికారులు భావిస్తున్నారు.అయితే ఇంతటి నరమేథానికి 64 ఏళ్ల పెడాక్‌ను పురిగొల్పిందేమిటన్నది మాత్రం ఇంకా మిస్టరీగానే మిగిలింది. గుంభనంగా ఉంటూ రహస్య జీవితం గడిపేందుకు మొగ్గు చూపే పెడాక్ ఏళ్ల తరబడి ఆయుధాలను నిల్వ చేస్తూ మృత్యు ఘంటికలు ఎందుకు మోగించాడనేదే ప్రశ్నగా ముందుకొస్తున్నదని లాస్‌వెగాస్ షెరీఫ్ జోసెఫ్ లాంబర్డో పేర్కొన్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని కేవలం పెడాక్ ఒక్కడే సేకరించి, నిల్వ చేశాడనడం ఊహకందని విషయమన్నారు. ఈ ప్రక్రియలో పెడాక్‌కు ఎవరో ఒకరు సహకరించి ఉంటారని అభిప్రాయపడ్డారు. మరోవైపు కాల్పుల ఘటన అనంతరం సజీవంగా బయటపడేందుకు పెడాక్ ప్రయత్నించాడనేందుకు ఆధారాలున్నాయని చెప్పారు. మ్యూజిక్ కన్సార్ట్ జరిగిన వేదికకు దగ్గరలోని ఓ హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలిందని తెలిపారు. ఇక మారణకాండ చోటుచేసుకున్న హోటల్ సూట్ నుంచి, మరో మూడు ప్రాంతాల నుంచీ పోలీసులు దాదాపు 50 వరకూ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 15 రైఫిళ్లలో బుల్లెట్లు నింపిఉన్నాయని చెప్పారు. ఇవన్నీ ఆటోమేటిక్ వెపన్స్ అని, పెడాక్ 2016 అక్టోబర్‌లోనే 30కి పైగా గన్లను కొనుగోలు చేశాడని విచారణలో తేలిందన్నారు.మరోవైపు కాల్పుల ఘటన వెనుక ఉగ్రవాద కుట్ర దాగుందని ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ అరోన్ రోజ్ చెప్పారు. ఇక పెడాక్ గర్ల్‌ఫ్రెండ్ డాన్లీని ఎఫ్‌బీఐ అధికారులు ప్రశ్నించగా పెడాక్ ఆలోచనల గురించి తనకు తెలియదని తేల్చిచెప్పినట్టు సమాచారం. -
కిల్లర్ గర్ల్ ఫ్రెండ్‌ను విచారించనున్న పోలీసులు
లాస్‌వెగాస్: మ్యూజిక్ కాన్సర్ట్‌పై కాల్పులతో విరుచుకుపడ్డ స్టీఫెన్ పెడాక్ గర్ల్ ఫ్రెండ్ డాన్లీ అమెరికా చేరుకోవడంతో విచారణలో కీలక ఆధారాలు లభ్యం కానున్నాయి. లాస్‌వెగాస్ నరమేథం సమయంలో ఫిలిప్పీన్స్‌లో ఉన్న డాన్లీ(62) తిరిగి రావడంతో ఎలాంటి నేరచరిత్ర లేని పెడాక్ ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టారనే కోణంలో అధికారులు విచారణ చేపట్టనున్నారు. ఈ దిశగా లాస్ఏంజెల్స్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఎఫ్‌బీఐ ఏజెంట్లు ఆమెను కలిశారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. డాన్లీ నుంచి త్వరలోనే తాము కీలక సమాచారం రాబడతామని లాస్‌వెగాస్ షెరీఫ్ జోసెఫ్ లాంబర్డో తెలిపారు. విలాసవంతం జీవితం గడుపుతూ గ్యాంబ్లర్‌గా పేరొందిన 64 ఏళ్ల పెడాక్ ఎందుకు ఇంతటి ఉన్మాద చర్యకు పాల్పడ్డాడనే దానిపై అధికారులు నిగ్గుతేల్చుతారని జోసెఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పెడాక్ ప్రియురాలు డాన్లీ ఫిలిప్పీన్స్ పర్యటనకు సంబంధించి అక్కడి అధికారులు అమెరికా అధికార యంత్రాంగానికి అన్ని వివరాలు అందించారు. అమెరికన్ అధికారుల విచారణకు తాము అన్ని రకాలుగా సహకరిస్తామని వారు చెప్పారు. కాల్పులకు ముందు పెడాక్ లక్ష డాలర్లను ఫిలిప్పీన్స్‌కు తరలించినట్టు తమ విచారణలో వెల్లడైందని అధికారులు చెబుతున్నారు.ఈ డబ్బు ఎక్కడికి వెళ్లిందనే దానిపైనా వారు ఆరా తీస్తున్నారు. పెడాక్ రోజుకు పదివేల డాలర్లు జూదం ఆడతారని పేర్కొంటున్నారు. -
షూటర్ ఎవరంటే..?
లాస్‌వెగాస్: అమెరికాలో నరమేధం సృష్టించిన దుండగుడిని లాస్‌వెగాస్‌కు చెందిన 64 ఏళ్ల స్టీఫెన్ పడోక్గా పోలీసులు గుర్తించారు. మాండలై బే హోటల్లో ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఈ దుండగుడిని పోలీసులు మట్టుబెట్టారు. మరో షూటర్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనలో 50 మందికి పైగా మరణించగా, 200 మంది గాయపడ్డారు. దాడి అనంతరం గల్లంతైన వారి కోసం తెలుసుకునేందుకు పోలీసులు హెల్ప్‌లైన్ నెంబర్లను విడుదల చేశారు. కాసినో హోటల్ 31వ అంతస్తులో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు సాయుధులు కాల్పులు జరిపారు. -
కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల కలకలం!
కాలిఫోర్నియా: గతేడాది భార్యాభర్తలు కాల్పులు జరిపి 14మందికి పైగా అమాయకులను పొట్టనపెట్టుకున్న శాన్ డియాగోలో మరోసారి కలకలం రేగింది. మంగళవారం శాన్ డియాగో లోని నావల్ ఆస్పత్రిలో కాల్పులు జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసినట్లు తెలియగానే అధికారులు అప్రమత్తమయ్యారు. మెడికల్ సెంటర్లో ఓ షూటర్ తిరుగున్నాడని అధికారులు అనుమానిస్తున్నారు. షూటర్ వార్త స్థానికంగా కలకలం సృష్టించడంతో ఆస్పత్రిని మూసివేసినట్లు ఓ అధికార ప్రతినిధి తెలిపారు. ఆస్పత్రి సిబ్బందిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి కొంత మందిని గాయపరిచినట్లు వివరించారు. ఆస్పత్రి బిల్డింగ్ వద్ద బలగాలు ఉన్నాయని, షూటర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.