టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే గురువారం దారుణ హత్యకు గురవటం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నారా ప్రాంతంలోని రైల్వే స్టేషన్ ముందు ప్రసంగిస్తున్న సమయంలోనే దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు అబే. ఈ ఘాతుకానికి పాల్పడింది కొన్నేళ్ల క్రితం నౌకాదళంలో పని చేసిన తెత్సుయ యమగామి(41)గా గుర్తించారు పోలీసులు. అయితే.. తాను మొదట చంపాలనుకుంది అబేను కాదని పోలీసులకు తెలిపినట్లు జపాన్ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఓ మత సంస్థకు చెందిన గురువును హత్య చేయాలని అనుకున్నట్లు పేర్కొన్నాయి.
మత సంస్థపై తనకు కోపం ఉందని, దానితో షింజో అబేకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతోనే హత్యకు పాల్పడ‍్డానని పోలీసులతో చెప్పినట్లు క్యోడో న్యూస్ తెలిపింది. అబే రాజకీయ విశ్వాసలను వ్యతిరేకిస్తున్న క్రమంలో తాను నేరం చేశానని భావించటం లేదని పేర్కొన్నట్లు వెల్లడించింది. అయితే.. ఆ మత గురువు ఎవరనే విషయం తెలియరాలేదు.
నౌకాదళంలో మూడేళ్లు విధులు:
మీడియా కథనాల ప్రకారం.. దుండగుడు యమగామి తన హైస్కూల్ విద్య తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై స్పష్టత లేదని తేలింది. తన గ్రాడ్యూయేషన్ ఇయర్ బుక్‌లో సైతం అదే రాశాడు. ప్రభుత్వ వర్గాల ప్రకారం అతడు 2005లో హిరోసిమా, క్యూర్ బేస్‌లోని నౌకాదళంలో చేరి మూడేళ్లు పని చేశాడు. 2020లో కన్సాయి ప్రాంతంలోని ఓ తయారీ సంస్థలో ఉద్యోగంలో చేరిన యమగామి.. దానిని సైతం రెండు నెలల క్రితమే మానేశాడు. అలసిపోయాననే కారణం చెప్తూ.. ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
దుండగుడి ఇంట్లో పేలుడు పదార్థాలు, తుపాకులు:
నారా ప్రాంతంలోని అతని అపార్ట్‌మెంట్‌లో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. అతని ఇంటి నుంచి పేలుడు పదార్థాలు, నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. షింజో అబే భౌతికకాయాన్ని శుక్రవారం టోక్యోకు తరలించారు. మంగళవారం అంతిమసంస్కారాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
చదవండి: షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్
Comments
Please login to add a commentAdd a comment