శకలం ధ్రువీకరణపై మలేసియా ఎదురుచూపు
కౌలాలంపూర్: హిందూ మహాసముద్రంలోని రీయూనియన్ ద్వీపంలో దొరికిన విమాన శకలం.. బోయింగ్ 777 విమానానికి చెందినదా కాదా ? అనేదానిపై ప్రెంచ్ పరిశోధకులనుంచి ధృవీకరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని మలేసియా రవాణా మంత్రి లియో టైయాంగ్ లెయి శనివారం పేర్కొన్నారు. దీనిపై ఇప్పటివరకూ తమకు పూర్తి నివేదిక అందలేదని ఆయన అన్నారు. గత ఏడాది మార్చి 18న కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు 239 మంది ప్రయాణికులతో వెళ్తున్న మలేసియాకు చెందిన ఎమ్‌హెచ్ 370 విమానం అంతుచిక్కని రీతిలో హిందూ మహాసముద్రం పరిధిలో అదృశ్యమైన విషయం తెలిసిందే.
ఈ విమాన శకలానికి సంబంధించిన ధృవీకరణ ఫలితం కోసం ఎదురుచూస్తున్నామని, త్వరలో ఆ నివేదిక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఏవియేషన్ పరిశోధకులు వచ్చే వారం విశ్లేషించనున్నారు. విమాన శకలంపై నిర్థారణ పరిశోధన మేరకు మలేసియా రెండు బృందాలను ఏర్పాటుచేయగా, అందులో ఒక బృందాన్ని పారిస్కు, మరొక బృందాన్ని రీయూనియన్ ద్వీపానికి పంపినట్టు రవాణా మంత్రి లియో తెలిపారు.