30 రోజుల్లో అధ్యక్షుడిని అంతం చేస్తాం!
మాల్దీవులు: మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ను 30 రోజుల్లో హత్య చేస్తామని ఓ వీడియో యూట్యూబ్లో హల్ చల్ చేసింది. దీంతో ఆ దేశ భద్రతా బలగాలు వెంటనే స్పందించి దానిని పోస్ట్ చేసిన 'సాంగు టీవీ' అనే ఓ ప్రైవేట్ టీవీ చానెల్పై రైడింగ్ నిర్వహించాయి. ఆ చానెల్లోని ఉద్యోగుల్లో ఎవరో ఒకరు దానిని పోస్ట్ చేసి ఉంటారని, ఉగ్రవాద కార్యకలాపాలకు వారు సహకరిస్తున్నారని అనుమానంతో సోదాలు నిర్వహించాయి.
ఈ సందర్భంగా మొత్తం 27 కంప్యూటర్ల హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నాయి. అత్యవసర పరిస్థితి విధించిన కొద్ది రోజులకే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం అక్కడ సంచలనంగా మారింది. ఈ ఘటనపై టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఇబ్రహీం వహీద్ స్పందిస్తూ ఈ వీడియోను తాము అప్లోడ్ చేయలేదని, అనవసరంగా తమ చానెల్పై బలగాలు దాడులు నిర్వహించి సోదాలు చేసి ప్రసార కార్యక్రమాలు ఆపేశాయని చెప్పారు.
'ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనుకకు తీసుకోవాలి. ఈ మేరకు చేసిన చట్టాన్ని కూడా రద్దు చేయాలి. లేదంటే 30 రోజుల్లోగా అధ్యక్షుడు, టూరిజం మంత్రులపై దాడులు చేస్తాం. హత్యలు చేస్తాం. ఉగ్రవాద కార్యకలాపాలతో హోరెత్తిస్తాం' అంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పేరిట యూట్యూబ్లో మాల్దీవుల అధ్యక్షుడిని బెదిరిస్తూ ఓ వీడియో సంచలనం రేపింది. దీని గురించి పోలీసులు కోర్టు అనుమతితో ఆరా తీయగా అది 'స్లావరీ స్లేవ్' అనే పేరుతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ సంకేతంతో పోస్ట్ చేశారు. ఇది సాంగు టీవీ పేరిట యూట్యూబ్లో అప్ లోడ్ చేసినట్లుగా ఉంది.