చిన్నారుల రెక్కల కష్టంతో స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు! | Material In Your Smartphone May Have Been Mined By Children | Sakshi
Sakshi News home page

చిన్నారుల రెక్కల కష్టంతో స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు!

Published Wed, Jan 20 2016 9:13 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

చిన్నారుల రెక్కల కష్టంతో స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు! - Sakshi

చిన్నారుల రెక్కల కష్టంతో స్మార్ట్ ఫోన్ బ్యాటరీలు!

ప్రముఖ టెక్ గాడ్జెట్లలో వాడే ముడి పదార్థాలు బాల కార్మికుల కష్టాల్లోని భాగాలేనని ఓ తాజా నివేదిక వెల్లడించింది. ప్రపంచంలో అత్యధిక భాగం జనం ఆదరిస్తున్నకోబాల్డ్, లిథియం అయాన్ బ్యాటరీల్లో ప్రముఖంగా వాడే పదార్థం సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో చిన్న తరహా మైనింగ్ కేంద్రాలనుంచి వస్తుందని, ఈ కేంద్రాల్లో పని చేసే కార్మికులు సుమారు ఏడు సంవత్సరాల వయసులోపు వారే ఉంటారని సర్వే చెప్తోంది.

ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఆఫ్రికన్ రిసోర్సెస్ వాచ్ ఉమ్మడిగా చేపట్టిన సర్వే ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఆపిల్, శామ్సంగ్, సోనీ, మైక్రోసాఫ్ట్ తయారీదారులు కాంగో డెమొక్రెటిక్ రిపబ్లిక్ గనులనుంచి కోబాల్డ్ ను సేకరిస్తున్నట్లు ఈ సర్వేలు చెప్తున్నాయి. కొత్త టెక్నాలజీని వాడుకుంటూ ఆనందిస్తున్న కోట్లమంది జనాభాలో ఏ ఒక్కరూ ఆ విషయాన్ని ఆలోచించరని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవహక్కుల పరిశోధకుడు.. మార్క్ డమ్మెట్ ఓ ప్రకటనలో తెలిపారు. షాపింగ్ మాల్స్ లో పేర్చి, కళాత్మకంగా అమ్మకాలు జరిపే ఆ వస్తువుల వెనుక.. ఇరుకైన సొరంగాల్లో... రాళ్ళ సంచులు మోస్తూ, బాల్యం మసకబారుతోందని, శాశ్వత ఊపిరితిత్తుల సమస్యలకు ఆ బాలకార్మికులు గురౌతున్నారని ఆయన అన్నారు.     

భూగర్భ సొరంగాల్లో ఈ మైనర్లు బేసిక్ టూల్స్  ను ఉపయోగించి  సుమారు 12 గంటల పాటు పనిచేస్తే వారికి ఒకటినుంచి రెండు డాలర్లు చెల్లిస్తారని రిపోర్టులు చెప్తున్నాయి. సొంరంగాల్లో మిగిలిపోయిన రాళ్ళు, కోబాల్ట్ ను  చిన్నారులు వెలికి తీస్తే...  దాన్ని మధ్యవర్తులు అమ్మకాలు జరిపి చైనాకు ఎగుమతి చేస్తున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. భారీ లోడ్ లు మోసుకెళ్ళే ఈ గనుల్లో సుమారు 40,000 మంది పిల్లలు రోజుకు పన్నెండు గంటలపాటు పనిచేస్తున్నట్లుగా 2014 లోనే యునిసెఫ్ అంచనా వేసింది. ఈ పదార్థాలను ఎగుమతి దారులునుంచి చైనా, దక్షిణ కొరియాల్లోని బ్యాటరీ తయారీదారులు కొనుగోలు చేసి, వాటి ఉత్పత్తులను  ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలైన టెక్ కంపెనీలకు సప్లై చేస్తున్నట్లు ఆమ్నెస్టీ వివరిస్తోంది.

అయితే శామ్సంగ్, సోనీ సహా... పలు కంపెనీలు ఈ విషయాన్ని నిర్థారించేందుకు, అంగీకరించేందుకు నిరాకరించాయి. కాగా యాపిల్ సంస్థ మాత్రం కోబాల్ట్ సహా బ్యాటరీ పదార్థాల సరఫరా వెనుక బాలకార్మికులు ఉన్నారా లేదా అన్న విషయాలను గుర్తిస్తామని తెలిపింది. ఇలా ఎగుమతి అయిన  కోబాల్ట్ ను ప్రత్యేకంగా  ఏ కంపెనీలు ఎటువంటి ఉత్సత్తుల్లో వినియోగిస్తున్నాయో నివేదికలు గుర్తించలేకపోయాయని... ఇది చింతించాల్సిన విషయమని మానవహక్కుల పరిశోధకుడు డమ్మెట్ విచారం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement