గిన్నిస్ బుక్లో సీసా సందేశం
లండన్: ఏకంగా 108 ఏళ్లపాటు సముద్రంలో ప్రయాణించిన ఓ బాటిల్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కింది. 1906లో బ్రిటన్‌కు చెందిన మెరైన్ బయెలాజికల్ ఆసోసియేషన్ (ఎన్‌బీఏ) ప్రతినిధులు ఓ ఖాళీ సీసాలో ఉత్తరాన్ని ఉంచి సముద్రంలోకి విసిరివేశారు. అప్పటి నుంచి సముద్రంలో ప్రయాణించిన ఆ బాటిల్ 2015లో జర్మనీలోని అమురమ్ దీవుల్లో మరియన్నే వింక్లర్ అనే ఆవిడ కంటపడింది.
బాటిల్‌ను తెరిచి చూసిన ఆమెకు అందులోని ఉత్తరంపై ఎన్‌బీఏ అడ్రస్‌కు తిరిగి పంపాలనే సూచన కనబడింది. దీంతో మరియాన్నే బాటిల్ దొరికిన ప్రదేశం తదితర వివరాల్ని నింపి ఎన్‌బీఏకు పంపించింది. ఈ ఉదంతాన్ని గిన్నిస్ ప్రతినిధులు గుర్తించి ‘బాటిల్‌లో అతి ఎక్కువ కాలం ప్రయాణించిన సందేశం’గా గుర్తింపునిచ్చారు.