మెక్సికో: అమెరికా, స్విట్జర్లాండ్ ల తర్వాత కీలకమైన న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్(ఎన్ఎస్జీ)లో భారత్ స్థానం కోసం మెక్సికో మద్దతు తెలిపింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సంప్రదింపులు జరిపిన ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటో తమ మద్దతును ప్రకటించారు. మోదీతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. దీంతో ఎన్రిక్ కు ధన్యవాదాలు తెలిపిన మోదీ మెక్సికో భారత్ కు ఎనర్జీ సెక్యురిటీలో కీలకభాగస్వామిగా పేర్కొన్నారు.
ఐదు దేశాల పర్యటన కోసం వెళ్లిన మోదీ చివరగా మెక్సికోలో ఆ దేశ అధ్యక్షుడితో సమావేశమై చర్చలు జరిపారు. అమ్మకందారు-కొనుగోలుదారులుగా కాకుండా అంతకంటే మంచి భాగస్వామ్యంతో ముందకెళ్తామని అన్నారు. ట్రేడ్ సెక్టార్, పెట్టుబడులు, వాతావరణ మార్పులు, ఎనర్జీ తదితర ఒప్పందాలపై ఇరువురు సంతకాలు చేశారు. చైనా ఎన్ఎస్ జీలో భారత సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తుండటంతో మెక్సికో, స్విట్జర్లాండ్ల మద్దతు భారత్ కు కలిసొచ్చే అంశం. భారత్ కు న్యూక్లియర్ ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ఎన్పీటీలో స్థానం లేదని చైనా వాదిస్తుండగా.. భారత్ ట్రాక్ రికార్డు కారణంగా తాము, మిగతా దేశాలు ఇందుకు సపోర్ట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం తెలిపిన విషయం తెలిసిందే. ఎన్ఎస్ జీ స్థానం వల్ల అటామిక్ ఎనర్జీ సెక్టార్ లో భారత్ భారీగా లాభపడుతుంది.