ట్రంప్ భార్యకు మిషెల్లీ అరుదైన ఆతిథ్యం
వాషింగ్టన్: అమెరికా ప్రథమ మహిళ మిషెల్లీ ఒబామా త్వరలో రానున్న కొత్త ప్రథమ మహిళ డోనాల్డ్ ట్రంప్ భార్య మిలానియా ట్రంప్కు అరుదైన ఆతిథ్యం ఇచ్చారు. త్వరలో ఆమె అడుగుపెట్టనున్న శ్వేత సౌదం దానికి సంబంధించిన ఇతర భవనాల గురించి తన అనుభవాలు పంచుకున్నారు. తేనీరును కూడా పంచుకున్న మిషెల్లీ.. ఒక్కసారి అధ్యక్ష భవనంలోకి అడుగుపెట్టాక ఎన్నో భావోద్వేగాలు అలుముకుంటాయని, అవన్నీ ఎప్పటికీ వదిలిపెట్టబుద్ధికానంత గొప్పగా అందంగా ఉంటాయని వివరించారు.
మిలానియాను శ్వేత సౌదానికి చెందిన ప్రైవేటు భవనంలో తిప్పుతూ ప్రముఖమైన ట్రూమన్ బాల్కనీ వద్దకు కూడా తీసుకెళ్లారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో తన పిల్లలను ఎలా పెంచానన్న అనుభవాలు కూడా ఆమెతో పంచుకున్నారు. శ్వేత సౌదంలో నివసించడమనేది ఫిష్బౌల్లో ఉంటున్నట్లుంటుందని, మ్యూజియంలో జీవిస్తున్నంత అద్బుతంగా ఉంటుందని మిలానియా ట్రంప్ కు తెలియజేశారు. మిలానియాకు కూడా అచ్చం ఇలాంటి అనుభూతులే కలుగుతాయని మిషెల్లీ చెప్పారని, త్వరలో శ్వేతసౌదాన్ని విడిచి వెళుతున్న ఆమె మధ్యమధ్యలో కొంత భావోద్వేగానికి లోనయ్యారని వౌట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జోష్ ఎర్నెస్ట్ తెలిపారు.