
ఈ మాస్క్‌తో వైరస్‌లకూ అడ్డుకట్ట
వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి.
బీజింగ్: వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. దీనికి కారణం మెర్స్, సార్స్ అనే వైరస్‌లే. వీటిబారిన పడకుండా ఉండాలంటే మాస్క్‌లు ధరించాలని చెబుతారు వైద్యులు. అయితే ఇప్పుడున్న మాస్క్‌లు కేవలం గాలిలోని ధూళి కణాలను అడ్డుకుంటాయే తప్ప వైరస్‌ల వంటి సూక్ష్మజీవులను ఇవి నిలువరించలేవనే విషయం ఎన్నో పరిశోధనల్లో రుజువైంది.
అయితే మెర్స్, సార్స్, ఇన్‌ఫ్లుయెంజా-ఏ వంటి అతి సూక్ష్మ వైరస్‌లను కూడా అడ్డుకునే ఓ మాస్క్‌ను హాంగ్‌కాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీకి చెందిన వాలెస్ తెంగ్ రూపొందించాడు. నానో పార్టికల్స్‌తో పలు పొరలుగా రూపొందించిన ఈ మాస్క్ పరిశుభ్రమైన గాలిని మాత్రమే లోనికి పంపుతుందని, ఒక నానోమీటర్(మనిషి వెంట్రుక మందం లక్ష నానో మీటర్లు) పరిమాణంలో ఉంటే వైరస్‌లను కూడా ఇది అడ్డుకుంటుందని తెంగ్ చెబుతున్నాడు.