
ఉ.కొరియా అణు పరీక్ష
అణు బాంబును పరీక్షించామని ప్రకటన.. ప్రపంచ దేశాల ఖండన
సియోల్: అణు బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా సంచలన ప్రకటన చేసింది. తమ దేశ ఉత్తరప్రాంతజలోని అణు పరీక్షల కేంద్రంలో కొత్తగా అభివృద్ధి చేసిన అణ్వాయుధం(వార్‌హెడ్)తో శాస్త్రవేత్తలు అణు పేలుడు జరిపారని ప్రభుత్వ టీవీ చానల్ వెల్లడించింది. దీంతో రాకెట్‌కు చిన్ని అణు వార్‌హెడ్‌ను అనుసంధానించే సామర్థ్యాన్ని సంపాదించుకున్నామని పేర్కొంది. శుక్రవారం పుంగ్యెరి అణు కేంద్రం సమీపంలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో కృత్రిమ భూకంపం సంభవించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
ఉ.కొరియా ఐదో అణు పరీక్ష అయిన తాజా పరీక్షపై ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. ఉ.కొరియా జరిపిన క్షిపణి పరీక్షల్లో ఇదే పెద్దదని, దీనికి 10 కిలోటన్నుల పేలుడు పదార్థాలు వాడారని దక్షిణ కొరియా ఆరోపించింది. ఆ అధినేత కిమ్‌జోంగ్ స్వీయ వినాశనం దిశగా వెళ్తున్నారని వ్యాఖ్యానించింది. ఉ.కొరియా తీవ్ర పర్యవనాసాలను, కొత్తగా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. దీనిపై ఆయన దక్షిణ కొరియా అధ్యక్షురాలు గుయెన్ హె, జపాన్ ప్రధాని అబేలతో చర్చించారు. అణు పరీక్ష జరిపింది నిజమే అయితే చాలా ఆందోళనకరమని ఐక్యరాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) చీఫ్ యుకియో అమానో అన్నారు.