ఇది వేదిక కాదు! | Narendra Modi speaks kashmir issue in United nations | Sakshi
Sakshi News home page

ఇది వేదిక కాదు!

Published Sun, Sep 28 2014 1:57 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఇది వేదిక కాదు! - Sakshi

ఇది వేదిక కాదు!

 కాశ్మీర్ అంశాన్ని ఐరాసలో పాక్ లేవనెత్తడం సరికాదు  
 ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మోదీ

 
 ఐరాస: కాశ్మీర్‌పై భారత వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి వేదికగా స్ప ష్టం చేశారు. ఆ అంశాన్ని లేవనెత్తేందుకు ఐరాస సరైన వేదిక కాదని తేల్చి చెప్పారు. 193 సభ్య దేశాల ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ (69వ సదస్సు)ను ఉద్దేశించి శనివారం ఆయన మొదటిసారి ప్రసంగించారు. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలు అవసరమని, 2015లోగా భద్రతామండలి సహా ఐరాసలో అవసరమైన సంస్కరణలన్నింటినీ చేపట్టాలని పిలుపునిచ్చారు. 21 శతాబ్దపు ఆకాంక్షలను ఐరాస ప్రతిఫలించాలన్నారు. ‘పాకిస్థాన్‌తో మనఃపూర్వక ద్వైపాక్షిక చర్చలకు భారత్ సిద్ధమే.  అయితే, అందుకు ఉగ్రవాద నీడ లేని.. అనువైన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పాక్‌పై ఉంది’ అని మోదీ కుండబద్ధలు కొట్టారు. సమస్యల పరిష్కారం దిశగా పురోగతి సాధించాలనుకుంటే.. ఈ వేదికపై వాటిని లేవనెత్తడం సరైన పని కాదన్నారు. పాకిస్థాన్ సహా పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను పెంచుకునేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. ‘యూఎన్‌లో సమస్యలను లేవనెత్తే బదులు.. వరద బాధిత కాశ్మీర్‌లో సహాయ చర్యల గురించి ఆలోచిస్తే మంచిద’ని షరీఫ్‌కు చురకలంటించారు. వరద బాదితులకు భారత్‌లో భారీ స్థాయిలో సహాయ చర్యలు చేపట్టామని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ సాయమందిస్తామన్నామని గుర్తుచేశారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐరాస జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ప్రసంగిస్తూ కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే.
 
 ఉగ్రవాద కేంద్రాలకు ఆశ్రయమిస్తున్నారు
 
 ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వివిధ పేర్లతో, వినూత్న రూపాలతో ఉగ్రవాదం విస్తృతమవడాన్ని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని దేశాలకు ఉగ్రవాదం ప్రమాదకరంగా మారిందన్నారు. ‘ఈ ఉగ్రవాద శక్తులను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయంగా, సమైక్యంగా, నిజాయితీగా ప్రయత్నిస్తున్నామా? లేక మన రాజకీయాలు, మన విభేదాలు, దేశాల మధ్య మన వివక్షలు, మంచి ఉగ్రవాదం.. చెడ్డ ఉగ్రవాదం అంటూ నిర్వచనాలు.. వీటిలోనే కొట్టుకుపోతున్నామా?’ అని ప్రపంచ దేశాలను మోదీ సూటిగా ప్రశ్నించారు. పాక్ పేరెత్తకుండానే నేటికీ కొన్ని దేశాలు తమ భూభాగంపై ఉగ్రవాద కేంద్రాలకు అనుమతించడమో లేక తమ విధానంలో ఉగ్రవాదాన్ని కూడా భాగం చేసుకోవడమో చేస్తున్నాయని విమర్శించారు.
 
 ఐరాసలో సంస్కరణలు
 
 ఐరాసలో సంస్కరణలపై మాట్లాడుతూ.. ప్రపంచదేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థగా ఐక్యరాజ్య సమితి మరింత ప్రజాస్వామికంగా రూపొందాలన్నారు. ‘20వ శతాబ్దపు అవసరాల ప్రాతిపదికగా ఏర్పడిన సంస్థలు 21వ శతాబ్దపు ఆకాంక్షలను ప్రతిఫలించలేవు. సమయానుకూలంగా మార్పు చెందకపోతే.. ఆ సంస్థల్లో ఎవరూ పరిష్కరించలేని స్థాయిలో అసంబద్ధత, గందరగోళం నెలకొంటాయి’ అని హెచ్చరించారు. ఐరాస భద్రతామండలిలో వచ్చే సంవత్సరం నాటికి అవసరమైన మార్పులు చేయాలని కోరారు. ‘ఐరాస 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్న 2015 సంవత్సరంలో.. భద్రతామండలిలో అత్యంతావశ్యక సంస్కరణలను చేపట్టాలి’ అన్నారు. ఏ ఒక్క దేశమో, లేక కొన్ని దేశాల బృందమో ప్రపంచ గతిని నిర్ధారించలేవని, ప్రపంచ దేశాలన్నింటికీ  నిజమైన ప్రాతినిధ్యం లభించాలని మోదీ స్పష్టం చేశారు. దాదాపు 35 నిమిషాల పాటు హిందీలో మోదీ చేసిన ప్రసంగంలో పశ్చిమాసియాలో ఉగ్రవాదం, భద్రతామండలిలో సహా ఐరాసలో సంస్కరణలు, సమ్మిళిత అంతర్జాతీయ అభివృద్ధి.. తదితర అంశాలను ప్రస్తావించారు.
 
 హసీనాతో చర్చలు
 
 న్యూయార్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారమిక్కడ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో అరగంట సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు తమ భూగాగాన్ని వాడుకోవడానికి అనుమతించబోమని, ఈ విషయంలో భారత్ కూడా తమలాగే వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామని హసీనా పేర్కొన్నారు. భారత్, బంగ్లాదేశ్ మిత్రదేశాలని, మోదీతో చర్చలు బాగా సాగాయని భేటీ తర్వాత విలేకర్లతో అన్నారు.
 
 మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
 
     {పపంచం పెను మార్పులకు, తీవ్రస్థాయి గతిశీలతకు లోనవుతున్న సమయమిది. ఎన్నడూ చూడని స్థాయిలో ఉద్రిక్తతలు, విపత్తులు చోటు చేసుకుంటున్నాయి. భారీ స్థాయి యుద్ధాలేవీ జరగడం లేదు.. అదే సమయంలో నిజమైన శాంతి కూడా నెలకొని లేదు. భవిష్యత్‌పై అనిశ్చితి ఏర్పడి ఉంది.
     ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర ప్రాంత రక్షణ ఆందోళనకరంగా ఉంది. ఆ ప్రాంత అభివృద్ధికి తీర ప్రాంత రక్షణ చాలా కీలకం.
     ఇరాక్, సిరియాల్లో విస్తరిస్తున్న ఉగ్రవాదాన్ని తుదముట్టించే కార్యక్రమాన్ని భారత్ స్వాగతిస్తోంది. ఆ ప్రాంతంలోని అన్ని దేశాలు ఇందుకు సహకరించాలి.
     అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర తీర్మానాన్ని ఐరాస ఆమోదించాల్సి ఉంది.
 
 బాన్ కి మూన్‌తో మోదీ భేటీ
 
 ఐరాస: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్‌తో శనివా రం భారత ప్రధాని నరేంద్రమోదీ సమావేశమయ్యారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ప్రసంగిస్తూ.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన విషయాన్ని ఈ సందర్బంగా మోదీ ప్రస్తావించారు. కాశ్మీర్ సమస్య ద్వైపాక్షికమైనదని, దాన్ని ప్రస్తావించేందుకు ఐరాస సరైన వేదిక కాదని బాన్ కి మూన్‌కు మోదీ స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
 
 న్యూయార్క్ లవ్స్ మోదీ!
 
 ఐరాస: అమెరికా పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అన్నిచోట్లా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తొలి ప్రసంగం ఇచ్చేందుకు వచ్చిన మోదీకి ఐరాస ప్రధాన కార్యాలయం వెలుపల భారీగా గుమికూడిన భారతీయ అమెరికన్లు సాదర స్వాగతం పలికారు. ‘మోదీ చిత్రం ఉన్న టీషర్టులు, మాస్క్‌లు ధరించి, న్యూయార్క్ లవ్స్ మోదీ’, ‘అమెరికా లవ్స్ మోదీ’ అనే ప్లకార్డులను ప్రదర్శిస్తూ, భారత్, అమెరికా జాతీయ జెండాలు చేతపట్టుకుని, డ్రమ్స్ వాయిస్తూ.. ‘మోదీ, మోదీ’ అనే నినాదాలు చేస్తూ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఐరాస ప్రధాన కార్యాలయం బయట వారికోసం ఒక ప్రత్యేక ఎన్‌క్లోజర్‌ను ఏర్పాటుచేశారు. తాను 40 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్నానని, ఏ భారతీయ నేతకూ ఈ స్థాయిలో స్వాగతం లభించలేదని సతీశ్ మల్హోత్రా అనే 75 ఏళ్ల వ్యక్తి వ్యాఖ్యానించారు.
 
 యోగా ప్రచార కార్యక్రమం
 
 యోగాకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం, ప్రోత్సాహం కల్పించేందుకు ఐరాస ప్రసంగాన్ని మోదీ ఉపయోగించుకున్నారు. యోగాపై తనకున్న అభిమానాన్ని మరోసారి అలా చాటుకున్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ‘యోగాను ప్రోత్సహించేందుకు ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏర్పాటు చేద్దాం. ప్రాచీన సంప్రదాయం మనకందించిన అమూల్యమైన బహుమతి యోగా. యోగాతో జీవనవిధానాన్ని మార్చుకోవచ్చు. వాతావరణ మార్పులను తట్టుకోవచ్చు. యోగా అంటే ఎక్సర్‌సైజ్ కాదు. నిన్ను నీవు తెలుసుకునే సాధనమే యోగా. మనసును శరీరాన్నీ ఏకం చేసే సాధనం యోగా. ప్రకృతితో మనిషిని సమన్వయం చేస్తుంది యోగా’ అని వివరించారు.
 
 ‘జీ1’ గా ముందుకెళ్దాం
 
 పంచ్‌లైన్లకు ప్రసిద్ధిగాంచిన మోదీ ఐరాస ప్రసంగంలోనూ వాటిని విరివిగా వాడారు. ‘జీ 5, జీ 20.. ఇలా వివిధ సంఖ్యలతో ‘జీ’లు(గ్రూప్‌లను ఉద్దేశిస్తూ) ఏర్పాటు చేసుకున్నాం. భారత్ కూడా పలు గ్రూప్‌ల్లో ఉంది. వీటన్నింటిని ఏకం చేసి ‘జీ1 గానో ‘జీ ఆల్’గానో మార్చుకోలేమా? ఒక్కటిగా ఉగ్రవాదంలాంటి కీలక సవాళ్లను ఎదుర్కోలేమా? అని ప్రశ్నించారు. పరస్పరాధారిత ప్రపంచంలో సమస్యల పరిష్కారానికి మరింత సమైక్యంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. మార్పు సాధ్యం కాదని నిరాశ చెందడం సులభమేనని, దాని వల్ల మన భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని, అందువల్ల నిజాయతీతో కూడిన అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరమని మోదీ పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement