
సాంకేతికతలో తిరుగులేని శక్తి
ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఎంతో ప్రత్యేకమని, భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సత్తా ఆ దేశ టెక్నాలజీకి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
► ఇజ్రాయెల్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
► ఆ దేశ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ
జెరూసలేం: ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఎంతో ప్రత్యేకమని, భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే సత్తా ఆ దేశ టెక్నాలజీకి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పర్యటన నేపథ్యంలో ఆ దేశ పత్రిక ‘ఇజ్రాయెల్ హయమ్’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తూ.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు.. ఉగ్రవాద వ్యతిరేక పోరులో సహకారానికి ఈ పర్యటన తోడ్పడుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.
‘ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు నెలకొని 25 ఏళ్లవుతున్న ప్రత్యేక సమయంలో ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నాను. ఇజ్రాయెల్ టెక్నాలజీ దిగ్గజమనే అభిప్రాయాన్ని గతంలో అనేక మంది భారతీయులతో పంచుకున్నాను. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కొని విజయవంతంగా ఇజ్రాయెల్ ముందుకు సాగింది. దశాబ్దం అనంతరం మళ్లీ ఆ దేశంలో పర్యటించడం ఆనందంగా ఉంది. (గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించారు). నీటి కొరత నుంచి మిగులు జలాల దిశగా ఆ దేశ పురోగమనం ప్రశంసనీయం. ఎన్నో రంగాల్లో అద్భుత విజయాలు సాధిం చింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంతో పాటు.. కొత్త రంగాల్లో సహకారానికి బాటలు వేస్తుందనే నమ్మకంతో ఉన్నాను.
సాంకేతికత భాగస్వామ్యంపై: గంగా నదీ ప్రక్షాళన, స్మార్ట్ సిటీస్ వంటి పథకాల అమలులో ఇజ్రాయెల్ సాంకేతికత కీలకపాత్ర పోషించగలదు. ఇజ్రాయెల్ ఆవిష్కర్తలు కొన్ని మార్పులు చేస్తే.. ఆ దేశ టెక్నాలజీ భారత్‌లోని వేలాది మంది ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపర్చేందుకు చేయూతనిస్తుంది. ఇజ్రాయెల్‌తో ఎగుమతులు, దిగుమతుల సంబంధాన్ని మేం కోరుకోవడం లేదు. టెక్నాలజీ ఆధారిత భాగస్వామ్యంపై మేం ఆసక్తిగా ఉన్నాం.
ఇరు దేశాలు ఉగ్ర బాధితులే..
ఉగ్ర భూతానికి ఇరు దేశాలు బాధితులే. అమాయక ప్రజల్ని బలితీసుకునే శక్తులు వర్ధిల్లకూడదని రెండు దేశాలు బలంగా నమ్ముతున్నాయి. భారత్‌కు సీమాంతర ఉగ్రవాదం ప్రధాన అడ్డంకి. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు వేర్పాటువాద శక్తులు యత్నిస్తున్నాయి. ఈ సమయంలో ఉగ్రపోరుకు ఇరు దేశాలు మరింత సహకారం కొనసాగించాలి.
‘రెండు రాజ్యాలే’ పరిష్కారం
ఇజ్రాయెల్, భావి పాలస్తీనా రాజ్యం.. రెండూ పక్కపక్కనే శాంతియుతంగా కొనసాగేందుకు వీలుకల్పించే ‘రెండు రాజ్యాల’ ఏర్పాటే వాటి మధ్య వివాదానికి పరిష్కారమని భారత్ విశ్వసిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌కు తొలిసారి భారత ప్రధాని
జెరూసలేం: నేటి నుంచి ప్రధాని మోదీ మూడ్రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కీలక రంగాల్లో సహకారంపై మోదీ చర్చలు జరుపుతారు. భారత ప్రధాని ఒకరు ఇజ్రాయెల్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కాగా.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 25 ఏళ్లు కావడంతో మోదీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జెరూసలేం విమానాశ్రయంలో నెతన్యాహు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. ఇప్పటివరకూ పోప్, అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఆ స్థాయి గౌరవం దక్కింది. మంగళవారం ప్రధానికి మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని విందు ఇస్తారు.
పర్యటనలో మోదీ పాల్గొనే దాదాపు అన్ని కార్యక్రమాల్లో నెతన్యాహు పాల్గొంటారు. జూలై 5న ఇజ్రాయెల్ రాష్ట్రపతి రెవెన్ రివ్లిన్‌తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతల్ని కలుసుకుంటారు. భారత సంతతి ప్రజలతో మోదీ సంభాషిస్తారు. 2008 ముంబై పేలుళ్ల నుంచి ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి హోల్జ్‌బెర్గ్ మోషేను, ఆ బాలుడిని కాపాడిన భారతీయ సంరక్షకురాలు శాండ్రా సామ్యూల్‌ను మోదీ కలుసుకుంటారు. అనంతరం జర్మనీలో 6, 7 తేదీల్లో జరిగే జీ–20 దేశాల సదస్సులో మోదీ పాల్గొంటారు.