ఖాట్మండు : నేపాల్‌లో గత నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 60కు చేరుకుంది. 41 మంది గల్లంతైనట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. ఒక్క మయాగ్డి ప్రాంతంలోనే 27 మంది మరణించినట్లు పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో వందలాది మంది ప్రజలు నిరాశ్రయులు కావడంతో స్థానిక పాఠశాల భవనాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో తలదాచుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తిస్తున్నామని సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించామని, మొదటి దశలో వారిని బయటికి తీయడానికి 30-35 గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు. మరికొంత మంది జాడ కోసం అన్వేషిస్తున్నామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. (షాకింగ్ విషయాలు వెల్లడించిన యునెస్కో నివేదిక)
కొండచరియలు విరిగిపడటంతో ఇళ్లు కూలి ఇప్పటికే వెయ్యిమందికి పైగా ప్రజలు నిరాశ్రయులు అయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అక్కడి స్థానిక మీడియా నివేదించింది. వర్షాల కారణంగా నారాయణి సహా ఇతర ప్రధాన నదులు పొంగి పొర్లుతున్నాయి. దేశ వ్యాప్తంగా వారాంతంలో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. టెరాయ్ ప్రాంతంలో అల్ప పీడనం కారణంగా భారీగా వర్షపాతం నమోదవుతుందని తాజా బులెటెన్‌లో వెల్లడించింది.
(పాక్ కాదు.. చైనానే డేంజర్: శరద్ పవార్)
Comments
Please login to add a commentAdd a comment