నౌమీ: పసిఫిక్ సముద్రంలోని న్యూ కెలడోనియా దీవుల వాసులు ఫ్రాన్స్ దేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం జరిగిన రెఫరెండంలో మొత్తం 2.69 లక్షల జనాభాలో అర్హులైన 1.75 లక్షల మంది పాల్గొన్నారు. మొత్తం ఓటింగ్‌లో 70 శాతం లెక్కింపు పూర్తి కాగా అందులో 59.5 శాతం మంది స్వాతంత్య్రం వద్దు, ఫ్రాన్స్‌తోనే ఉంటామంటూ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. అయితే, ఈ ఫలితాలు 1853లో ఫ్రాన్స్ వలస ప్రాంతంగా మారిన తర్వాత అక్కడ సెటిలైన శ్వేత జాతీయులు, స్థానిక కనాక్ ప్రజల మధ్య వైషమ్యాలను మరింత పెంచే ప్రమాదముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
1998లో రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో 70 మంది చనిపోయారు. ఆ తర్వాతే న్యూ కెలడోనియాకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు, రెఫరెండం నిర్వహించేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం అంగీకరించింది. దాని ప్రకారం స్వాతంత్య్రం కావాలా వద్దా అనే విషయంపై 2022లో మరోసారి రెఫరెండం నిర్వహించాల్సి ఉంటుంది. ఫ్రాన్స్ ప్రధాన భూభాగానికి దాదాపు 18వేల కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ సముద్రంలోని ఈ సుందరమైన దీవులు ఫ్రాన్స్‌కు వ్యూహాత్మకంగా కీలకమైనవి. ప్రపంచంలోని నికెల్ నిల్వల్లో 25 శాతం ఇక్కడే ఉన్నాయి. నికెల్‌ను ముఖ్యమైన ఎలక్ట్రానిక్ విడి భాగాల తయారీలో వినియోగిస్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment