
ఎఫ్‌బీఐ కోరిక సమంజసమే
ఎఫ్‌బీఐ అభ్యర్థన అసమంజసం అంటున్న యాపిల్ సంస్థపై వైట్ హౌస్ కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చనిపోయిన ఉగ్రవాది యాపిల్ ఐ ఫోన్ పాస్ వర్డ్ కనిపెట్టడం ఆ టెక్నాలజీ సంస్థకు పెద్ద విషయం కాదని, అందుకు ఎటువంటి కొత్త టెక్నాలజీని, డిజైన్ ను కనిపెట్టాల్సిన అవసరం లేదని విరుచుకు పడుతున్నారు. ఎటువంటి బ్యాక్‌డోర్‌ను సృష్టించాల్సిన పని లేకపోయినా... ఎఫ్‌బీఐకి సహకరించడం లేదని వైట్ హౌస్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఎఫ్‌బీఐ అభ్యర్థన చాలా పరిమితమైన పరిధిలోనిదని వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ విలేకరులతో అన్నారు.
శాన్ బెర్నార్డినోలో క్రిస్మస్ పార్టీ సందర్భంలో ఫరూక్ తన భార్యతో కలసి 14 మందిని హతం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పోలీసు కాల్పుల్లో భార్య సహా అతడూ చనిపోయాడు. ఆ ప్రాంతంలో ఉగ్రవాది ఫరూక్ కు చెందిన ఐఫోన్ ను ఎఫ్‌బీఐ స్వాధీనం చేసుకుంది. అందులోని డేటాను సేకరించడానికి మాత్రమే ఎఫ్‌బీఐ యాపిల్ సంస్థను అభ్యర్థిస్తోందని, డేటాలోని విషయాలు అమెరికా ప్రజల గోప్యత, పౌర స్వేచ్ఛను రక్షించగలవని ఒబామా యంత్రాంగం వాదిస్తోంది. అమెరికా ప్రజల రక్షణ కోసం ఆ ఫోన్ లోని డేటాను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఉగ్రవాదుల వివరాలు తెలిస్తే... ప్రజల రక్షణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు ఎర్నెస్ట్ వివరిస్తున్నారు.
ఈ కేసులో ఉగ్రవాద కదలికలను, వారికి సంబంధించిన సమాచారం ఎఫ్‌బీఐ పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు పాస్ వర్డ్ అన్లాక్ చేయాలని ఎఫ్‌బీఐ ఒత్తిడి తెస్తోందని చెప్తున్నారు. పాస్ వర్డ్ విషయంలో టెక్ కంపెనీలు ఏదో ఒక మార్గాన్ని చూపాల్సిందేనని అధికారులు డిమాండ్ చేస్తున్నారు. అమెరికా ప్రజల భద్రత కన్నా చనిపోయిన ఉగ్రవాది వ్యక్తిగత అంశాలను కాపాడేందుకు యాపిల్ సంస్థ ప్రాధాన్యం ఇస్తోందంటూ ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు ఎంతటి ఒత్తిడి తెచ్చినా యాపిల్ సంస్థ మాత్రం తమపై కొనుగోలుదారుల నమ్మకాన్ని కోల్పోకూడదన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పాస్‌వర్డ్ అన్ లాక్ చేసేందుకు విముఖతనే చూపిస్తోంది.