
సియోల్ : యుద్ధం వస్తే ఆచరణలో పెట్టేందుకు అమెరికా-దక్షిణ కొరియాలు సిద్ధం చేసిన వ్యూహాల సమాచారాన్ని ఉత్తరకొరియా తస్కరించింది. గత నెలలో దక్షిణ కొరియా మిలటరీ నెట్‌వర్క్‌పై సైబర్ దాడికి పాల్పడిన ఉత్తరకొరియా హ్యాకర్లు 235 గిగాబైట్ల(జీబీ) సమాచారాన్ని చోరీ చేశారు. దక్షిణ కొరియా అధికార డెమొక్రటిక్ పార్టీకి చెందిన రీ చీయోల్ హీ అనే ప్రజా ప్రతినిధి మంగళవారం ఓ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అమెరికా, ఉత్తరకొరియాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఈ రిపోర్టు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. చోరీ గురైన సమాచారం ఏదో కూడా ఇంకా పూర్తిగా గుర్తించలేదని రీ చెప్పారు. కిమ్ తలనరికేందుకు రంగంలోకి దించనున్న స్పెషల్ టీం, దక్షిణ కొరియా స్పెషల్ ఫోర్సెస్, అమెరికాతో సంబంధాలు, అమెరికాతో మిలటరీ డ్రిల్స్, పవర్ ప్లాంట్లు, కీలక మిలటరీ స్థావరాలు ఇలా సౌత్ కొరియాకు చెందిన కీలక సమాచారం నియంత కిమ్ జాంగ్ ఉన్ చేతిలోకి వెళ్లినట్లు వెల్లడించారు.
దక్షిణ కొరియా వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. ఉత్తరకొరియాలో 6,800 మంది సైబర్ హ్యాకర్లు ఉన్నారు. గతంలో ఉత్తరకొరియా హ్యాకర్లు సోనీ పిక్చర్స్‌పై హ్యాకింగ్‌కు పాల్పడిన విషయం తెలిసిందే.