మళ్లీ జూలు విదిల్చిన కిమ్
సాక్షి, టోక్యో: ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ శనివారం వరుస క్షిపణి ప్రయోగాలతో ప్రపంచదేశాలను హడలెత్తించారు. ఉత్తరకొరియా పరీక్షించిన మూడు క్షిపణులు జపాన్ సముద్ర జలాల్లో పడ్డాయి. అమెరికా, దక్షిణ కొరియా దళాల సంయుక్త యుద్ధ కసరత్తులు చేసిన తర్వాత ఈ పరీక్షలు జరగడం గమనార్హం.
అమెరికా-దక్షిణ కొరియాల యుద్ధ కసరత్తులను ఉత్తరకొరియా ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోంది. తమ దేశంలోకి చొచ్చుకు వచ్చేందుకే యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తున్నారని ఆ దేశం భావిస్తోంది. నెల రోజుల క్రితం వరకూ అమెరికా-ఉత్తరకొరియాలు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్న విషయం తెలిసిందే. అయితే వారం రోజుల కిందట ఇరు దేశాధినేతలు మెత్తబడినట్లు కనిపించారు. దీంతో యుద్ధ జ్వాలలు ఆరినట్లనని నిపుణులు భావించారు.
కానీ, తాజా పరిణామం మరింత ఉద్రిక్తతలకు దారి తీసే విధంగా ఉంది. ఉత్తరకొరియా శనివారం పరీక్షించిన క్షిపణుల్లో మొదటిది, మూడోది లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాయి. రెండో క్షిపణి మాత్రం టార్గెట్‌ను చేరుకుందని అమెరికాకు చెందిన పసిఫిక్ కమాండ్ పేర్కొంది. ప్రయోగించినవన్నీ చిన్న శ్రేణి క్షిపణులేనని వెల్లడించింది.