అణు పరీక్షకు ఉత్తరకొరియా సిద్ధం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దూకుడు ప్రదర్శిస్తుంటే తాను మాత్రం తక్కువ తినలేదంటూ ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కూడా అంతే దూకుడుగా ఉంటున్నారు. తాజాగా ఆయన అణ్వస్త్రాలను పరీక్షించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలిసింది.ఘిటీవల తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఉత్తరకొరియాలోని పంగ్యే -రి అనే ప్రాంతంలో దీనికి సంబంధించిన పరికరాలను ఇప్పటికే మోహరించినట్లు ఆ చిత్రాల్లో ఉంది. ఒకవేళ ఇదే నిజమై.. వాళ్లు అణ‍్వస్త్రాలను పరీక్షిస్తే మాత్రం 2006 తర్వాత ఈ తరహా పరీక్ష ఇది ఆరోసారి అవుతుంది.
ఏప్రిల్ 12వ తేదీన తీసిన ఉపగ్రహ చిత్రాల్లో పంగ్యే- రి వద్ద ఉత్తరకొరియా సైనికుల కదలికలు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ప్రధానంగా అక్కడ మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ ఏరియాలో ఎక్కువ మంది ఉంటున్నారని, సైట్‌లోని కమాండ్ సెంటర్ వద్ద కూడా కొంతమంది ఉన్నారని అమెరికాకు చెందిన 38 నార్త్ అబ్జర్వేటరీ సంస్థ తెలిపింది. అక్కడి వాతావరణాన్ని బట్టి చూస్తుంటే మాత్రం అణ్వస్త్ర పరీక్ష జరిగే అవకాశం కనిపిస్తోందని చెప్పింది. అయితే దక్షిణ కొరియా అధికారులు మాత్రం అదేమీ ఉండకపోవచ్చని కొట్టిపారేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరకొరియా అంత సాహసం చేయకపోవచ్చని అంటున్నారు.