‘కిమ్’ కర్తవ్యం..?
సాక్షి, సియోల్: అమెరికాలోని గువాం ప్రాంతంపై క్షిపణులతో విరుచుకుపడతామని హెచ్చరిస్తున్న ఉత్తర కొరియా అదే దూకుడు కొనసాగిస్తున్నది. రాకెట్ ఇంజన్స్, రాకెట్ వార్‌హెడ్ టిప్స్ ఉత్పత్తులను ముమ్మరంగా చేపట్టాలని కొరియా నేత కిమ్‌జోంగ్ ఉన్ ఆదేశించారు. ఉత్తర కొరియాతో శాంతి చర్చలకు అమెరికా విదేశాంగ కార్యదర్శి రెక్స్ టిల్లర్‌సన్ సంకేతాలు పంపిన నేపథ్యంలో కిమ్ వైఖరి ఆందోళన రేకెత్తిస్తోంది. డిఫెన్స్ అకాడమీకి చెందిన కెమికల్ మెటీరియల్ ఇన్‌స్టిట్యూట్‌ను సందర్శించిన కిమ్ తాజా ఉత్తర్వులు పలు సందేహాలను ముందుకుతెస్తున్నాయి.
రాకెట్ ఇంజన్స్, రాకెట్ వార్‌హెడ్ టిప్స్‌ను భారీ సంఖ్యలో ఉత్పత్తి చేయాలని దీనికోసం ఇంజన్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని విస్తరించాలని, రాకెట్ వార్‌హెడ్ టిప్స్ ఉత్పత్తి సామర్ధ్యం పెంచాలని కిమ్ ఆదేశించినట్టు ఉత్తరకొరియా వార్తాసంస్థ కేసీఎన్‌ఏ వెల్లడించింది. గత ఏడాది నుంచి ఉత్తర కొరియా రెండు అణు పరీక్షలతో పాటు, డజన్ల కొద్దీ క్షిపణి పరీక్షలను నిర్వహించింది.
మరోవైపు ఉత్తరకొరియా సంయమనం పాటించడాన్ని స్వాగతిస్తున్నామని, రానున్న రోజుల్లో చర్చల ప్రక్రియకు సానుకూల వాతావరణం ఉంటుందని టిల్లర్‌సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. యూఎస్ ప్రకటన వెలువడిన కొద్దిగంటల్లోనే కిమ్ కెమికల్ మెటీరియల్ సెంటర్‌ను సందర్శించడం ఉత్తరకొరియా తీరుపై అనుమానాలు రేకెత్తిస్తోంది.