సముద్రంలో అణు విద్యుత్ కేంద్రాలు
కృత్రిమ ద్వీపాల అవసరాల కోసం చైనా కసరత్తు
హాంకాంగ్: అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న చైనా.. సముద్ర జలాలపై ఆధిపత్యం కోసం అవసరమైన అన్ని మార్గాలనూ వాడుకుంటోంది. దక్షిణ చైనా సముద్రంలో తాను ఇటీవల నిర్మించిన కృత్రిమ ద్వీపాల అవసరాల కోసం సముద్రంలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి తెరతీసింది.
ఎందుకు?
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో చైనా తన సైనిక, సముద్ర భద్రత అవసరాల కోసం ‘ఫీరీ క్రాస్ రీఫ్’, ‘జాన్సన్ రీఫ్’ తదితర పేర్లతో ఇటీవల కొన్ని కృత్రిమ ద్వీపాలు నిర్మించింది. అక్కడి రాడార్ వ్యవస్థలు, లైట్‌హౌస్‌లు, బ్యారక్‌లు, పోర్టులు, వైమానిక స్థావరాల నిర్వహణకు భారీగా విద్యుత్ కావాలి. వేల మైళ్ల దూరంలోని భూమిపై ఉన్న పవర్ గ్రిడ్ల నుంచి వీటికి తీగల ద్వారా విద్యుత్‌ను అందించడం చాలా కష్టమైన పని. దీనికి పరిష్కారంగా.. సముద్రంలోనే అణు విద్యుత్ కేంద్రాలను నిర్మించి విద్యుత్ సరఫరా చేయాలని చైనా యోచిస్తోంది. ఈ ద్వీపాలతోపాటు చమురు రిఫైనరీల విద్యుత్ అవసరాలను తీర్చేందుకు నౌకలపై అణు ప్లాంట్లను నిర్మించాలని చైనా షిప్పింగ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ కసరత్తు చేస్తోంది. ప్లాంట్లకు చాలా డిమాండ్ ఉందని, ఇవి భారీగా కావాలని చైనా అణు ఇంధన సంస్థ డెరైక్టర్ జు దాజే చె ప్పారు.
గతంలో..
తేలియాడే అణు విద్యుత్ ప్లాంట్లు కొత్తవేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధకాలం నాటి ఒక నౌకలో అమెరికా 1960లలో అణు రియాక్టర్‌ను ఏర్పాటు చేసింది. పనామా కెనాల్ జోన్‌లోని విద్యుత్ అవసరాల కోసం దీన్ని నిర్మించారు.
ఎంతవరకు సురక్షితం?
దక్షిణ చైనా సముద్రంలో తరచూ భారీ తుపాన్లు వస్తుంటాయి. అణు ప్లాంటు ఉన్న నౌకలు తుపాన్ల ముప్పును తట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నౌకలో కీలక రియాక్టర్ కరిగిపోవడం వంటి భారీ అణు ప్రమాదాలు జరిగితే గాలుల ద్వారా రేడియోధార్మికత జనావాసాలకు వ్యాపించే అవకాశముందని యూనియన్ ఆఫ్ కన్సర్న్డ్ సైంటిస్ట్స్‌కు చెందిన అణు భద్రత ప్రాజెక్టు డెరైక్టర్ డేవిడ్ లాక్కామ్ చెప్పారు.