
'ఓ' బ్లడ్ గ్రూపా.. అయితే మీకు మతిమరుపు లేనట్టే..!
లండన్: ఏ, బి, ఏబి రక్త గ్రూప్‌లతో పోలిస్తే ఓ గ్రూప్ రక్తం కలిగిన వారికి మతిమరుపు సంబంధమైన అల్జీమర్స్ సంభవించే అవకాశం తక్కువేనని పరిశోధకులు అంటున్నారు. ఓ రక్త గ్రూప్ కలిగిన వారి మెదడులో బూడిద వంటి పదార్థం ఎక్కువగా ఉంటుందని, ఇది అల్జీమర్స్ రాకుండా కాపాడుతుందని వారు తెలిపారు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ షెఫ్ఫిల్డ్ పరిశోధకుల అధ్యయనం ప్రకారం జ్ఞాపకశక్తి సంబంధ సమస్యలు తలెత్తడానికి రక్త గ్రూప్‌లు కూడా కారణమవుతాయి.
యుక్త వయసులో మెదడులో బూడిద రంగు పదార్థం సహజంగానే ఉంటుంది. అయితే వయసు పైబడుతున్న కొద్దీ మెదడులో ఈ పదార్థ స్థాయిలో మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులు రక్త గ్రూప్‌లను బట్టి వేర్వేరుగా ఉంటాయి. ఓ రక్త గ్రూప్ ఉన్నవారిలో ఈ పదార్థం ఎక్కువగా ఉండి, అల్జీమర్స్ వ్యాధి రాకుండా మెదడులోని భాగాల్ని నియంత్రిస్తుంది. అనేక మంది మెదడును ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ ద్వారా పరీక్షించి శాస్త్రవేత్తలు ఈ విషయాలు వెల్లడించారు.