ఒబామా భారీ క్షమ
78 మందికి క్షమాభిక్ష, 153 మందికి శిక్ష తగ్గింపు
హŸనలులు: పదవీకాలం ముగుస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ఒబామా భారీ ఎత్తున క్షమాగుణం ప్రదర్శించారు. 78 మందిని క్షమించిన ఆయన.. మరో 153 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారు. ఇంతమందికి క్షమాభిక్ష పెట్టడం గతంలో ఏ అధ్యక్షుడు చేయలేదని వైట్ హౌస్ వర్గాలు చెప్పాయి. క్షమాభిక్షలపై గత కొన్ని నెలలు ఒబామా వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారు. వీటిల్లో శిక్ష తగ్గించేవి ఎక్కువగా ఉంటున్నాయి.
క్షమాభిక్షలో ఓటు వేయడంపై ఉన్న నిషేధాన్ని తొలగించడం, పదవులకు అర్హత, న్యాయస్థానంలో తీర్పులు చెప్పే అర్హత పొందటం లాంటివి ఉంటాయి. ఇంకా శిక్షలో తీవ్రతను తగ్గిస్తారు. ఈసారి క్షమాభిక్ష పొందిన వారిలో ఎక్కువ మంది నకిలీ కరెన్సీ మార్పిడి, పేలుడు పదార్థాలతో దొరికినవారు, అనుకోకుండా జరిగిన మారణకాండలో పాల్గొన్నవారు ఉన్నారు. అధ్యక్షుడిగా ఒబామా ఇప్పటి వరకూ 148 మందికి క్షమాభిక్ష పెట్టగా.. 1176 మంది ఖైదీలకు శిక్ష తగ్గించారని వైట్ హౌస్ న్యాయవాది నీల్ ఎగ్గెల్‌స్టన్ తెలిపారు.