ఉత్తర కొరియాపై ఒబామా సీరియస్
వాషింగ్టన్: మరోసారి అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన ఉత్తర కొరియాపై అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉ.కొరియా అణ్వాయుధాల ముప్పును అధ్యక్షుడు ఒబామా సీరియస్‌గా తీసుకున్నారని, అమెరికన్ల భద్రతకుముప్పు వాటిల్లకుండా గట్టి చర్యలు చేపడుతున్నారని వైట్‌హౌస్ పేర్కొంది. దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న ఉ.కొరియాకు వ్యతిరేకంగా చైనా సహా యావత్తు అంతర్జాతీయ సమాజం ఏకమైందని తెలిపింది. భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘిస్తున్న ఉ.కొరియాపై మండలి మరిన్ని ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశముందని పేర్కొంది. ముందు జాగ్రత్తగా ముగువామ్ దీవుల్లో యాంటీ బాలిస్టిక్ క్షిపణుల వ్యవస్థ ను మోహరించినట్టు ఎర్నెస్ట్ తెలిపారు. అదే సమయంలో నౌకాదళ బలగాన్నీ పెంచుతున్నట్టు వెల్లడించింది.
భారత్‌లో అక్రమ డ్రగ్స్ తయారీ: అమెరికా
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోపాటు 21 దేశాలు అక్రమంగా మత్తుమందులను ఉత్పత్తి చేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు ఒబామా అన్నారు. అఫ్గనిస్తాన్, బహమాస్, మయన్మార్, బొలీవియా, వెనిజులాతోపాటు పలు ఆఫ్రికా, యూరప్ దేశాల పేర్లను ఒబామా ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే.. దీంతో సంబంధం లేకుండా తమ మిత్ర దేశాలైనా బొలీవియా, మయన్మార్, వెనిజులాలకు అమెరికా సాయం అందుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నార్కోటిక్స్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఏకాభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో అమెరికన్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీన్ని తీవ్రంగా పరిగణిస్తామన్నారు.