వైట్‌హౌస్‌లో.. మంచినీళ్లతో..
మోదీకి విందు ఇచ్చిన ఒబామా
ఉపవాసం కారణంగా ఏమీ తినని మోదీ
90 నిమిషాల పాటు చర్చలు
వాషింగ్టన్: అది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్.. విందు ఇస్తున్నది అధ్యక్షుడు ఒబామా.. ఈ విందుకు హాజరైన అసాధారణ అతిథి మన ప్రధాని నరేంద్ర మోదీ.. కానీ ఈ విందులో మోదీ కేవలం కొన్ని మంచి నీళ్లు తాగేసి ఊరుకున్నారు. కారణం నవరాత్రుల సందర్భంగా ఆయన ఉపవాసం ఉండడమే..
తమ దేశ పర్యటనకు వచ్చిన మోదీకి ఒబామా వైట్‌హౌస్‌లో విందు ఇచ్చారు. ఈ విందులో అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్, ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు సుసాన్ రైస్‌తో పాటు భారత్ తరఫున విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, దౌత్యవేత్త ఎస్.జైశంకర్, విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్‌తో సహా మొత్తం 20 మంది మాత్రమే పాల్గొన్నారు. వైట్‌హౌస్‌లోని బ్లూరూమ్(భోజనాల గది)లో ఏర్పాటుచేసిన ఈ విందులో బాస్మతి బియ్యంతో వండిన అన్నం, చేపలు, పండ్లను, మామిడి క్రీమ్‌తో చేసిన ఐస్‌క్రీమ్‌ను సిద్ధంగా ఉంచగా... మోదీ మాత్రం కొన్ని మంచినీళ్లను మాత్రమే తీసుకున్నారు. నవరాత్రుల్లో ఉపవాసం ఉంటున్నందున తానేమీ తినడం లేదని.. మిగతా అతిథులంతా ఇబ్బంది పడకుండా సాధారణంగానే భోజనం చేయాలని విజ్ఞప్తి చేశారు.
90 నిమిషాలు భేటీ..: వైట్‌హౌస్‌లో విందు అనంతరం ఒబామాతో మోదీ పలు అంశాలపై దాదాపు 90 నిమిషాల పాటు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అనంతరం.. ‘భేటీ చాలా బాగా సాగింది. పలు అంశాల్లో ఇరు దేశాలు కలసి పనిచేయాలనే అంశంలో ఇరువురి ఆలోచనలను పంచుకున్నాం..’’ అని మోదీ ట్వీట్ చేశారు. ఒబామా, మోదీల భేటీపై భారత విదేశాంగశాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. దౌత్య సంబంధాలు, ఉగ్రవాద నిర్మూలన, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ తదితర అంశాలపై వారు చర్చించినట్లు తెలిపారు. ఈ భేటీ చాలా అద్భుతంగా కొనసాగిందని పేర్కొన్నారు. కాగా.. ఈ సందర్భంగా ఒబామాకు భగవద్గీతపై మహాత్మాగాంధీ వ్యాఖ్యానాల సంకలనాన్ని, మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్‌కు చెందిన జ్ఞాపికను మోదీ బహుమతిగా ఇచ్చారు.
మోదీ.. ‘కెం చో’..
‘కెం చో’... వైట్‌హౌస్‌లో విందుకు హాజరైన ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కుశల ప్రశ్న ఇది. ‘కెం చో’ అంటే గుజరాతీ భాషలో.. ‘ఎలా ఉన్నారు?’ అని అర్థం. గుజరాతీ అయిన మోదీని ఆయన మాతృభాషలోనే ఒబామా పలకరించారు. దీనికి స్పందనగా మోదీ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత మోదీతో కరచాలనం చేసిన ఒబామా.. వైట్‌హౌస్‌లోకి తోడ్కొని వెళ్లారు.