మోడీ, ఒబామా మధ్య సారూప్యతలెన్నో..
వాషింగ్టన్: నూతన ప్రధానిగా ప్రమాణం చేసిన నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా మధ్య అనేక సారూప్యతలున్నాయి. వీరిద్దరూ ‘మార్పు’ నినాదంతోనే అధికార పీఠాన్ని దక్కించుకున్నారు. ఇద్దరూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం పొందారు. అలాగే ఎన్నికల ముందు సాగిన ప్రచార పర్వంలో హైటెక్ పంథా అనుసరించారు. మరికొన్ని పోలికలివీ..
ట్విట్టర్‌లో ఇద్దరికీ లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారుమోడీ, ఒబామా ఇద్దరూ మహాత్మాంగాంధీని అమితంగా అభిమానిస్తారు. ఒబామా వైట్‌హౌస్‌లోని తన ఆఫీసులో గాంధీ చిత్రపటాన్ని పెట్టుకున్నారు.పర్యావరణ పరిరక్షణ అంశాల్లో ఇద్దరి ఆలోచనలు దగ్గరగా ఉంటాయి. గ్లోబల్ వార్మింగ్ కట్టడికి గట్టి చర్యలు తీసుకోవాలని చెబుతుంటారు.దేశంలో రోడ్లు, బ్రిడ్జీలు, నౌకాశ్రయాలు, ఎయిర్‌పోర్టులు వంటి మౌలిక వసతులకు ఒబామా పెద్దపీట వేస్తున్నారు. మోడీ కూడా మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నారు.
ఐటీ, ఇంటర్నెట్‌కు ప్రాధాన్యం పెంచి పాలనలో పారదర్శకత పెంచుతామని, అవినీతిని కట్టడి చేస్తామని మోడీ చెబుతున్నారు. ఒబామా కూడా అమెరికాలో ఈ దిశగా అనేక చర్యలు చేపడుతున్నారు.ఒబామా అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ పాత తరహా విధానాలకు స్వస్తి పలికారు. మోడీ కూడా ఇదే పంథాలో సాగుతున్నారు. మంత్రిత్వ శాఖలను గణనీయంగా తగ్గించాలని యోచిస్తున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీకి ఒబామా శుభాకాంక్షలు
వాషింగ్టన్: భారతదేశ 15వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ట పరిచే క్రమంలో మోడీ నేతృత్వంలోని నూతన నాయకత్వంతో కలిసి ముందుకుసాగుతామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు వైట్‌హౌస్‌లోని ప్రెస్ సెక్రటరీ జే కార్నే సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక అవకాశాలు, స్వేచ్ఛ, ప్రజా భద్రత తదితర అంశాల్లో ఇరు దేశాలూ నిబద్ధతతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఒబామా పేర్కొన్నట్టు తెలిపారు. ఇప్పటికే ఆయా విషయాలను మోడీతో ఒబామా చర్చించారని, ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఇరువురు నేతలూ ఫోన్‌లో సంభాషించుకున్నారని జే వివరించారు.